టీమిండియా గెలిచింది.. మనల్ని ఓడించారు

ఇండియా - పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా, అది కేవలం ఓ 'ఆట'లా వుండదు. అది ఎప్పుడూ ఓ యుద్ధాన్ని తలపిస్తుంది. మైదానంలో ఎంత స్నేహపూర్వకంగా వ్యవహరించాలనుకున్నాసరే.. అది కుదరని పని. చాలా సందర్భాల్లో ఆటగాళ్ళు తమ ఆవేశకావేశాల్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.. అంతలా ప్రయత్నించినా అప్పుడప్పుడూ ఆ ఆవేశకావేశకాలు బయటపడిపోతుంటాయి. 

ఆట వేరు, ఇరు దేశాల మధ్యా ఇతరత్రా సమస్యలు వేరు.. అనుకోవడానికి వీల్లేదు. క్రికెట్‌ రెండు దేశాల మధ్యా 'స్నేహాన్ని' చిగురింపజేసే ఛాన్సే లేదు. అందుకే, అది సరిహద్దు అయినా, క్రికెట్‌ మైదానం అయినా అక్కడ గెలుపు మనదే అయి వుండాలని ప్రతి భారతీయ క్రికెట్‌ అభిమానీ అనుకుంటాడు.

సేమ్‌ టు సేమ్‌ పాకిస్తాన్‌లోనూ ఇవే పరిస్థితులు కన్పిస్తుంటాయి. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌కి ముందే 'ఇది ఆట కాదు యుద్ధం..' అంటూ క్రికెట్‌ వర్గాల్లోనూ చర్చ జరిగింది. పలువురు క్రికెటర్లూ ఇదే మాట చెప్పారు. గెలిచాం.. యుద్ధంలో గెలిచాం. 

కానీ, ఒక్కడు.. మనల్ని ఓడించాడు. అతడెవరో కాదు, ఆర్థిక ఉగ్రవాది అనదగ్గ విజయ్‌ మాల్యా. పాకిస్తాన్‌ కంటే ప్రమాదకారిగా విజయ్‌ మాల్యా మారతాడని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు విజయ్‌ మాల్యా అంటే ప్రముఖ వ్యాపారవేత్త. ఇప్పుడతను 420. బ్యాంకులకు వేల కోట్లు 'పంగనామం' పెట్టిన విజయ్‌ మాల్యా, నిస్సిగ్గుగా విదేశాల్లో తిరుగుతున్నాడు.

తిరుగుతాడు మరి, అతన్ని దొడ్డిదారిన సాగనంపింది మన పాలకులే కదా.! ఒకళ్ళు ఆ విషవృక్షాన్ని పెంచి పోషిస్తే, ఇంకొకరు ఆ ఆర్థిక ఉగ్రవాదిని దేశం దాటించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయ్‌మాల్యా పనిచేశాడంటే, అది దేశ దౌర్భాగ్యమే. 

నిన్నటి మ్యాచ్‌లో విజయ్‌ మాల్యా కన్పించాడు. కన్పిస్తే తప్పు కాదు, విజయ్‌ మాల్యా పలువురు భారత మాజీ క్రికెటర్లతో చెట్టాపట్టాలేసుకు తిరిగాడు. ఆ మాజీ క్రికెటర్లలో 'క్రికెట్‌' పెద్ద సునీల్‌ గవాస్కర్‌ కూడా వున్నాడు. ఆర్థిక ఉగ్రవాది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యాని సునీల్‌ గవాస్కర్‌ కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? దీన్ని దేశద్రోహం అని ఎందుకు అనకూడదు.? 

దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది.. కానీ, విజయ్‌ మాల్యాని కలవడం ద్వారా సునీల్‌ గవాస్కర్‌ అనే పెద్ద మనిషి మన వ్యవస్థల్ని అవమానపర్చాడు.. మనల్నందర్నీ ఓడించే ప్రయత్నం చేశాడు. సునీల్‌ గవాస్కర్‌ ఒక్కడే కాదు, విజయ్‌ మాల్యాని కలిసిన మాజీ క్రికెటర్లందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందిప్పుడు.

Show comments