'ఇరువురు భామల కౌగిలిలో స్వామీ ఇరుకున పడి నీవు నలిగితివా'...అనే పాట విన్నారు కదా. ఇది ఆయన బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలయ్య సినిమాలోదే. ఆయన ఇద్దరు ప్రియరాళ్ల మధ్య నలిగిపోయే సందర్భానికి సంబంధించిన పాట ఇది. సినిమాలో బాలయ్య నలిగిపోయినట్లే రాజకీయ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇద్దరంటే ఇద్దరు మహిళలో, పురుషులో కాదు. ఈయన నలిగిపోతున్నది కేబినెట్‌లోని అవినీతి మంత్రులు, వైకాపా నుంచి ఫిరాయించిన జంప్ జిలానీల మధ్య. బాబు కేబినెట్‌లో కొందరు మంత్రులు అవినీతి పనులు చేస్తుండగా, కొందరు అమాత్యులపై అవినీతి ఆరోపణలున్నాయి. కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. వీరి కారణంగా బాబు సర్కారుకు అప్రదిష్ట కలుగుతోంది. పరువు పోతోంది. కాని వారిని ఏమీ చేయలేకపోతున్నారు. ఇక రెండోది...ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇస్తానని వారిని చేర్చుకున్నప్పుడు వాగ్దానం చేశారు.
చేరినవారిలో కొందరు రాజకీయంగా దిగ్గజాలు. వారి నియోజకవర్గాల్లో కింగ్‌లు. వీరంతా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కాని ఇవ్వలేకపోతున్నారు. వారికేమో అసహనం పెరుగుతోంది. వీరంతా వైకాపా ద్వారా వచ్చిన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండా 'పచ్చ' పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని అనర్హులను చేయాలని వైకాపా పోరాటం చేస్తోంది. ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించకుండా టీడీపీలో కొనసాగిస్తున్నందుకు ఇప్పటికే బాబుకు చెడ్డ పేరు వచ్చింది. తీరా వారికి మంత్రి పదవులు ఇచ్చాక అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే అదో పరువు తక్కువ. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచేది లేదని కేంద్రం చెబుతోంది. అదే జరిగితే ఫిరాయింపుదారులందరికీ టిక్కెట్లు ఇచ్చే అవకాశముండదు. సో...ఓపక్క అవినీతి మంత్రుల, మరోపక్క ఫిరాయింపుదారుల గురించి ఆలోచిస్తూ బాబు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట....!
బాబు కేబినెట్‌లో అవినీతికి పాల్పడుతున్న 'ముదురు' మంత్రులున్న మాట వాస్తవం. 'మీలో కొందరు అవినీతి పనులు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు'..అని ముఖ్యమంత్రే పలుమార్లు హెచ్చరించారు. బాబు నిర్ధారించుకోకుండా అలా అనరు కదా...! అవినీతిపరులే కాదు, అసమర్థులు కూడా ఉన్నట్లు బాబు చెప్పారు. వీరికి అనేకసార్లు క్లాసులు పీకారు. అయినప్పటికీ మార్పు వస్తున్నట్లు కనబడటంలేదు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని చాలాకాలం క్రితం వార్తలొచ్చాయి. లోకేష్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకుంటారని అనుకున్నారు. కాని ఈ రెండూ ఇప్పటివరకు జరగకపోవడం టీడీపీ నేతలకు కూడా అర్థం కావడంలేదు. తాజా సమాచారం ప్రకారం కేబినెట్‌లో చేరాలని లోకేష్ ఆత్రపడుతున్నా చంద్రబాబు సుముఖంగా లేరట...! కుమారుడిపై అవినీతి ఆరోపణలు వస్తాయని భయపడుతున్నారట...! పదవిలో ఉన్నప్పుడు అలాంటి ఆరోపణలు తప్పనిసరిగా వస్తాయి. బాబు మీదనే ఉన్నాయి కదా..!
చంద్రబాబు అభిప్రాయం ప్రకారం ఎక్కువమంది మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదు. ఇక మంత్రుల, ప్రజాప్రతినిధుల కుమారుల నిర్వాకాలు పెద్ద తలనొప్పిగా మారాయి. 'పుత్రరత్నాలు' విచ్చలవిడిగా వ్యవహరిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుండటంతో చంద్రబాబు వారికి కూడా క్లాసులు తీసుకున్నారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. తాజాగా మంత్రి రావెల కిషోర్ బాబు-గుంటూరు జెడ్పీ ఛైర్‌పర్సన్ వివాదం చూశాం. ఆమె మీడియా ఎదటనే కన్నీరు పెట్టుకుంది. దీనిపై బాబు తీవ్రంగా ఆగ్రహించి ముగ్గురు సభ్యుల కమిటీ కూడా వేశారు. చివరకు వివాదం సమసిపోయిందని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో రావెలకు, మరో మంత్రి పత్తిపాటి పుల్లారావుకు పడటంలేదు. వీరిద్దరి పనితీరు కూడా బాబుకు నచ్చడంలేదు.
మంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి కిమిడి మృణాళినికి పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను సీఎం అసమర్ధుడిగా చూస్తున్నారు. ఆయన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగద పద్మనాభాన్ని కంట్రోలు చేయలేకపోతున్నారట...! మంత్రి పీతల సుజాతకు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పడటంలేదు. చిత్తూరులో మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు కొట్టుకుంటున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన జిల్లా కర్నూలులో వైకాపా నుంచి వచ్చినవారిపై గుర్రుగా ఉన్నారు. నెల్లూరులోనూ ఇదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో గ్రూపు తగాదాలు టీడీపీ కొంప ముంచుతాయేమోనని కొందరు నాయకులు భయపడుతున్నారు. మొత్తం మీద టీడీపీ అస్తవ్యస్తంగా ఉందనే భావన కలుగుతోంది.