బాహుబలిపై పూరి సెటైర్లు

బాహుబలి ప్రాజెక్టుపై పూరిజగన్నాధ్ తనదైన స్టయిల్ లో స్పందించాడు. బాహుబలి లాంటి సినిమాను తీయడం కంటే వంద రూపాయలు పెట్టి అలాంటి సినిమాలు చూడ్డానికే తను ఇష్టపడతానని అంటున్నాడు. అసలు ఓ సినిమా కోసం రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి, మరో రెండేళ్ల పాటు షూట్ చేయడం లాంటి తతంగాలు తన బాడీకి సూట్ అవ్వవని ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు. 

తన సినిమా, తను రాసుకునే స్క్రిప్ట్ కంటే రెండేళ్ల టైం అనేది చాలా విలువైనదని.. అంతటి విలువైన టైమ్ ను తను వేస్ట్ చేయనని అంటున్నాడు పూరిజగన్నాధ్. అలా చేస్తే తనతో పాటు తన యూనిట్ లో అందరి టైం వేస్త్ అవుతుందని పూరి శెలవిచ్చాడు. నిజానికి ఓ సినిమాపై వర్క్ చేస్తున్నప్పుడు.. 2 నెలల తర్వాత తను రాసుకున్న స్క్రిప్ట్ తనకే బోర్ కొట్టేస్తుందని.. అలాంటిది రెండేళ్లు వర్క్ చేసి బాహుబలి లాంటి సినిమా చేయడం తనవల్ల కాదని అంటున్నాడు పూరి. 

నిజానికి ఇక్కడ పూరి.. బాహుబలి ప్రాజెక్టును పొగడలేదు, అలా అని తిట్టనూ లేదు. ఆ భారీ ప్రాజెక్టును తనకు అన్వయిస్తూ సెటైరిక్ గా మాట్లాడాడంతే. కానీ పూరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్లను ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు వక్రీకరించుకోవడం ప్రారంభించారు. ఈ కామెంట్స్ ను పూరిజగన్నధ్.. ఎప్పుడు, ఏ సందర్భంలో చేశాడనే విషయంపై కూడా క్లారిటీ లేదు.

Show comments