దాసరి అంటే శ్రమ, పరిశ్రమ

దర్శకరత్న దాసరి నారాయణరావుని తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ 'గురువుగారూ' అని పిలుచుకుంటుంటారు. నిన్నటితరం నటీనటులే కాదు, నేటితరం నటీనటులూ ఆయన్ని 'గురువు'గానే భావిస్తారు. దాసరికి శిష్యులెంతమంది వున్నారో, అంతకన్నా ఎక్కువగా ఏకలవ్య శిష్యులున్నారు. అదీ దాసరి నారాయణరావు ప్రత్యేకత. 

ఓ దర్శకుడు 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించడమంటే చిన్న విషయం కాదు. ఓ పక్క దర్శకత్వం వహిస్తూనే, ఇంకోపక్క రచయితగానూ పలు సినిమాలకు పనిచేశారు. అదే సమయంలో, పాటలు రాశారు. కొన్ని సినిమాల్లో నటించారు. 50కి పైగా సినిమాల్ని నిర్మించారు కూడా. దాసరి నారాయణరావు కీర్తి ప్రతిష్టల గురించి చెప్పుకుంటూ పోతే అదో పెద్ద 'చరిత్ర' అవుతుంది. నిజమే, దాసరి నారాయణరావు అంటే, ఎప్పటికీ తెలుగు సినిమాకి ఓ డిక్షనరీనే. 

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా.. ఇంతేనా.? కాదు కాదు, అంతకు మించి ఆయన 'పెద్దన్న'. అవును, తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ దాసరి నారాయణరావు 'పెద్దన్న'. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా, ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది దాసరి నారాయణరావే. ఆయన ఆశీస్సులు వుంటే చాలు, సినీ పరిశ్రమలో తమకు ఏ కష్టమూ రాదని నమ్ముతారు. ఎలాంటి సమస్య అయినా దాసరి పరిష్కరిస్తారన్న నమ్మకం, భరోసా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. 

ఇప్పుడంటే వసూళ్ళ రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాంగానీ, దాసరి దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో, హిట్‌ సినిమా అంటే ఎన్ని నెలలు, ఎన్నేళ్ళు ఆడిందనేది లెక్క. 'దాసరోడి సినిమా చూడాలి..' అంటూ బళ్ళు కట్టుకుని సినిమాలకు పరుగులు పెట్టారు జనం.

అదీ దాసరి నారాయణరావు గొప్పతనం. 'దర్శకత్వం' అన్న విభాగానికి స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన దర్శకుడాయన. దర్శకుడంటే, సినిమా అనే నౌకకి కెప్టెన్‌.. అనే మాట ఆయన ఎప్పుడూ చెప్పేవారు. చెప్పడమే కాదు, ఆ శాఖకు అంత గౌరవం తీసుకొచ్చారు దాసరి నారాయణరావు. 

ఉదయం పత్రిక ద్వారా పత్రికా ప్రపంచంలో సంచలనాలకు తెరలేపారు దాసరి. శివరంజని సినిమా పత్రికా అప్పట్లో ఓ సంచలనం. దాసరి దెబ్బకి అప్పట్లో టాప్‌ పొజిషన్‌లో వున్న మేటి పత్రికలూ లబోదిబోమన్నాయి. ముందే చెప్పుకున్నాం కదా.. దాసరి అంటే శ్రమ.. పరిశ్రమ.. దాసరి అనే పరిశ్రమ నుంచి ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు.. వీళ్ళే ఆ ప్రోడక్ట్స్. ఆయన జీవితం ఓ చరిత్ర. తెలుగు సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఈ లోటు పూడ్చలేనిది.

Show comments