తెలుగునాట ఇవెక్కడి రూల్స్?

స్వాతంత్ర్య పోరాటాన్ని ఉక్కుపాదాలతో అణచివేసిన బ్రిటిష్ రాజ్ ను తలపింపచేస్తున్నాయి ఉభయ తెలుగు ప్రభుత్వాలు. తమ తమ ప్రభుత్వాలను ఇరుకున పెట్టే సభలు, సమావేశాలు, ప్రదర్శనలను పోలీసు బలంతొ అణచేయాలని చూస్తున్నాయి. మనం ప్రజాస్యామ్య యుగంలో వున్నామా? ఇంకా బ్రిటిష్ రాజ్ కాలంలోనే వున్నామా అన్నఅనుమానాలు రేకెత్తిస్తున్నారు. 

ఏ ప్రభుత్వం వున్నా ప్రజలో, సంఘాలో, పార్టీలో సభలు సమావేశాలు పెట్టుకోవడం, నిరసన ప్రధర్శనలు నిర్వహించడం అన్నది సర్వ సాధారణం. ఇక ఉద్యమాలంటారా? వాటికి రూల్స్ వుండనే వుండవు. అలా వుండి వుంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ వుండేది కాదు, విశాఖ ఉక్కు సాధ్యమయ్యేది కాదు, ప్రత్యేక తెలంగాణ కల సాకారమయ్యేది కాదు. 

కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర రావు కూడా తమ తమ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ప్రదర్శనలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకుండా చూడాలని కిందా మీదా అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రత్యేక హోదా కోసం విశాఖలో తలపెట్టిన శాంతియుత ప్రదర్శనను ఎంత కర్కశంగా అడ్డుకున్నారో అందరికీ తెలిసిందే. అది చంద్రబాబు వ్యవహారం. 

ఇప్పుడు కేసిఆర్ వంతు వచ్చింది. తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతులు ఇవ్వం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇదే జేఎసి సారథ్యంలో ఎన్ని ప్రదర్శనలు జరిగాయో అందరికీ గుర్తు వున్నదే. కేసిఆర్ భాషలో ఆంధ్రోళ్ల పాలన వున్నపుడే హ్యాపీగా ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ స్వయం పాలన వచ్చాక అనుమతికి నో అంటున్నారు. అనుమతికి నో అనడమే కాకుండా, ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. మరి గతంలో ఇలాంటి ర్యాలీల్లో పాల్గొన్న వారిపై ఎన్నికేసలు ఎత్తివేయలేదు? అంటే అప్పుడు ఓ రూలు..ఇప్పుడో రూలు అన్నమాట. 

ఈ చంద్రుడైనా, ఆ చంద్రుడైనా గమనించాల్సింది ఒక్కటే. అనుమతులు ఇవ్వకుండా ప్రదర్శనలు, రాలీలు ఆపగలరు కానీ, ప్రజల మనోభావాల్ని మార్చలేరు. ఇలా చేయడం వల్ల అవి మరింత గాయపడి, ప్రభుత్వ వ్యతిరేక భావాలు మరింత రాటు దేలుతాయి తప్ప వేరు కాదు.

Show comments