నందమూరి నటసింహం బాలకృష్ణ భార్య వసుంధర వద్ద పదిలక్షల రూపాయల డబ్బు దొరకడం ఆసక్తికరంగా ఉంది. తిరుపతి ఎయిర్ పోర్టు తనిఖీల్లో ఆమె దగ్గర ఉన్న డబ్బు బయటపడింది. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ నోట్లన్నీ పాతవి కావడం. మారకం రద్దు అయిన ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు ఆమె దగ్గర దొరికాయి.
అది కూడా తిరుపతి ఎయిర్ పోర్టులో. ప్రస్తుత కరెన్సీ వ్యవహారాల నడుమ పది లక్షల రూపాయలు విలువజేసే పాత నోట్లు అంటే.. ఒకరకంగా సంచలనమనే చెప్పాలి. ఇరవై రోజుల నుంచి పాత నోట్లు బ్యాంకుల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య భార్య అంత డబ్బును హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నారు!
అదేమంటే.. అధికారులు ధ్రువీకరించారని, దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ సరిగ్గా ఉన్నాయని అంటున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ? పదిలక్షల రూపాయల డబ్బు చేతబట్టుకుని వెళుతున్న ఆమె.. అందుకు సంబంధించిన ఐటీ పరిమితులను కూడా అదే చేతిలో పట్టుకుని ఉంటుందా? అధికారులు అడ్డగ్గానే ఆ రుజువులు చూపేసి ఉంటుందా?! వినడానికే వింతగా లేదా?
అధికారంలో ఉన్న వాళ్ల ఇళ్లల్లో వందల కోట్ల రూపాయల డబ్బు దొరికితేనే .. ఆ తర్వాత ఆ వ్యవహారాలు వార్తల్లోకి రాలేదు. ఇలాంటి వ్యవస్థలో ఈ పది లక్షల రూపాయల ను కవర్ చేసుకోవడం.. పెద్ద కష్టమా?
ఇక గమనించాల్సిన మరో అంశం.. ఎయిర్ పోర్టులో తనిఖీలు అయ్యాకా, వసుంధర తిరుమల వెళ్లడం! ఆమె డబ్బును అధికారులు ఆమెకు ఇచ్చేయగా.. ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారట. మరి ఈ నోట్లను ఆమె ఎక్కడికి తీసుకెళ్లారో.. అర్థం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదని ఈ వార్తలు విన్న సామాన్యులు అంటున్నారు.
ఆ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లేని పోని గొడవలు వస్తాయి.. తిరుమల వెంకన్న హుండీలేకి వేసేస్తే పుణ్యం బోనస్ గా వస్తుంది.. అనే భావనతో వసుంధర ఈ డబ్బును తీసుకెళ్లి ఉంటుందనేది టీ కొట్టు కామెంట్!