నంద్యాల మాదేనంటున్న అఖిల..!

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా అఖిల ప్రియ తను కేవలం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి పరిమితం కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నంద్యాల కూడా మాదే అనే ధోరణితోనే ఆమె ఉందనే మాట అనుచర వర్గం నుంచి వినిపిస్తోంది. నంద్యాల నుంచి తాము చెప్పిన వారికే టికెట్.. అనేది ఇప్పుడు అఖిలప్రియ మాటగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల సీటును వదులుకునేది లేదని అనుచర వర్గం చెబుతోంది. భూమా చిన్న కూతురు అక్కడి నుంచి పోటీ చేస్తుందా? లేక భూమా అన్నకొడుకు అక్కడ నుంచి పోటీ చేస్తాడా అనేది తర్వాతి ప్రశ్న అని.. నంద్యాల నియోజకవర్గం మాత్రం తమదే అని భూమా అఖిల ప్రియ వర్గం చెబుతోంది. ప్రస్తుతం ఉన్నటాకేంటంటే.. మంత్రి పదవిని ఇవ్వడంతోనే భూమా వర్గ ఆధిపత్యానికి బాబు చెక్ చెప్పాడని, అంతగా ప్రాధాన్యత లేని పర్యాటక శాఖను అప్పగించేసి.. భూమా ఫ్యామిలీని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి బాబు పరిమితం చేసేసినట్టే అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆమె అసహనభరితురాలు అవుతుందని, అంతేగాక.. భూమా మరణం నేపథ్యంతో విమర్శలు మరింతగా వస్తాయని తెలుగుదేశం అధినేత లెక్కలేశాడు. భూమా చావుకు కారణం చంద్రబాబే అనేంత స్థాయిలో మాటలు వస్తుండటంతో.. అఖిలప్రియకు పదవినిచ్చి ఆ ప్రచారాన్ని కొంతైనా తగ్గించుకోవడానికే.. ఈమెకు పదవినిచ్చారు. అలాగే రేపు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో.. భూమా ఫ్యామిలీ నుంచి టికెట్ విషయంలో డిమాండ్ వచ్చినా.. మంత్రి పదవిని ఇచ్చాంగా, ఇంకేంటి? అనే ప్రశ్నవేయడానికి అవకాశం ఉంటుంది. బాబు లెక్క ప్రకారం.. నంద్యాల సీటుపై భూమా ఫ్యామిలీ ఆశలు వదులుకోవాల్సిందే. అయితే అఖిలప్రియ మాత్రం నంద్యాల ను వదులుకునేది లేదన్నట్టుగా అనుచరుల వద్ద స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాము చెప్పిన వారికే ఆ నియోజకవర్గం టికెట్ అంటున్నారట.. మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన నంద్యాలను వదులుకునేది లేదనే అంటున్నారట. మరేం జరగబోతోందో!

Show comments