చంద్రబాబు అసహనం.. మళ్ళీ మొదలైంది.!

అవును, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో అసహనం మళ్ళీ మొదలైంది. మళ్ళీ.. అని ఎందుకనాల్సి వస్తోందంటే, అదంతే.. ఆయనకు పరిస్థితులన్నీ అనుకూలంగా వుంటే హ్యాపీ.. ఏ మాత్రం పరిస్థితులు తేడాగా కన్పించినా అసహనం పెరిగిపోతుంటుంది.. ఆ అసహనం తన చుట్టూ వున్నవారిపై ఆయన ప్రదర్శించడం సర్వసాధారణమే. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ళ పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబులో అసహనం ఇప్పుడిప్పుడే కట్టలు తెంచుకుంటోంది. అదెందుకు అలా జరగడంలేదు, ఇదెందుకు ఇలా జరగడంలేదు.. అంటూ అటు మంత్రుల్ని, ఇటు అధికారుల్నీ కడిగిపారేస్తున్నారు. 'ఇంకోసారి మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి.. అలా జరగాలంటే ఇంకా ఇంకా కష్టపడాలి.. ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి.. తేడా వచ్చిందో, పదవులు ఊడిపోతాయ్‌..' అంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసేస్తుండడం గమనార్హం. 

పార్టీ కోసం సమయం కేటాయించడం, రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు బిల్డప్‌ ఇస్తుండడం.. ఇవన్నీ చంద్రబాబు అసహనంలో భాగమే. మంత్రిగా, తన పుత్రరత్నానికి ఛాన్స్‌ ఇచ్చే విషయమై చంద్రబాబు మీనమేషాల్లెక్కెడుతున్న వేళ, కొత్తగా చంద్రబాబులో ఈ అసహనం చూసి, పార్టీ శ్రేణులు 'మళ్ళీ కథ మొదటికొచ్చింది..' అంటూ అంతర్గతంగా వ్యాఖ్యానించుకుంటుండడం గమనార్హం. 

2019 ఎన్నికలకు ఇంకా సమయం వుంది.. సమయం వుందీ.. అంటే వుంది అంతే. కానీ, ఆ సమయం చంద్రబాబుకి ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే, గడచిన రెండున్నరేళ్ళలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించిందేమీ లేదు. కేంద్రాన్ని బతిమాలి ర్యాంకులు తెచ్చుకుంటున్నారాయన. ఆ ర్యాంకులతో చంద్రబాబు కాలక్షేపం చేయొచ్చుగానీ, అభివృద్ధి అనేది ప్రజలకు కన్పించాలి కదా.!  Readmore!

2018 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయాలన్నది చంద్రబాబు టార్గెట్‌. రెండున్నరేళ్ళు నిద్రపోయి, ఇప్పుడు హడావిడిగా డెడ్‌లైన్లు పెడితే ఉపయోగమేముంటుంది.? ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లూ చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. దాంతో, వాళ్ళపైనా చంద్రబాబు మండిపడిపోతున్నారట. ఎంత గింజుకుంటే మాత్రం, కిందా మీదా పడి దొర్లేసినా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదు. అదీ బాబు అసహనానికి ఓ కారణం. రాజధాని పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 

అమరావతిలో అంతర్భాగమైన విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ఇంకేముంది, పుష్కరాల నాటికి ఫ్లై ఓవర్‌ని అందుబాటులోకి తెచ్చేస్తామని చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంది. ఏదీ, ఎక్కడ.? ఇప్పటికీ ఆ ఫ్లై ఓవర్‌ ఓ కొలిక్కి రాలేదాయె. ఫ్లై ఓవర్‌ పరిస్థితే ఇలా వుంటే, ఇంకా ప్రారంభించని రాజధాని రహదార్ల మాటేమిటి.? కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీతో శంకుస్థాపన చేయించేస్తే రోడ్లు పడిపోయినట్లు కాదు కదా.! 

తాత్కాలిక సచివాలయంలో ఇంకా అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణం పూర్తి కావాల్సి వుంది. అదెప్పుడు.? అంటే, స్పష్టమైన సమాధానం రాని పరిస్థితి. రైల్వే జోన్‌ రావట్లేదాయె, ప్రత్యేక సాయానికి చట్టబద్ధతా అయోమయంగా తయారయ్యిందాయె.. ఇన్ని సమస్యల మధ్య చంద్రబాబులో అసహనం పెరగకుండా వుంటుందా.? దాన్ని ప్రదర్శించడానికి తేరగా పార్టీ నేతలు, మంత్రులు, అధికారులే చంద్రబాబుకి దొరుకుతున్నారు మరి.

Show comments