కిడ్నీ ఘోష: కొత్తా దేవుడండీ

రాజకీయ నాయకులు వస్తున్నారు వెళుతున్నారు.. మంత్రులు, ముఖ్యమంత్రులూ స్టేట్‌మెంట్లు దంచేస్తున్నారు.. కానీ, 'ఉద్దానం కిడ్నీ వ్యధ' తగ్గడంలేదు. రోగమొస్తే, వైద్యం చెయ్యాలి. కానీ, రాజకీయం చేస్తే రోగమెలా తగ్గుతుంది.? ఉద్దానం ఈ దుస్థితిని ఎదుర్కోవడానికి కారణం రాజకీయమే. ఉద్దానం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.. కిడ్నీ రోగం కారణంగా. అయినా, కేంద్ర ప్రభుత్వానికిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికిగానీ, ఉద్దానం కన్పించదు. కన్పించదుగాక కన్పించదు.! 

ఏదన్నా రాజకీయ పార్టీ ఉద్దానం కిడ్నీ బాధితుల వెతల్ని ప్రస్తావిస్తే చాలు, అధికారంలో ఎవరున్నాసరే.. అప్పటికప్పుడు 'తూతూ మంత్రం' చర్యలు చేపట్టడం పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. ప్రాజెక్టుల కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడరు.. పాలకుల పబ్లిసిటీ కోసమూ వందల, వేల కోట్లు ఖర్చు చేయడం చూస్తున్నాం. ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ రోగానికి 'మందు' వెయ్యడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. 

మొన్నామధ్య పవన్‌కళ్యాణ్‌ రంగంలోకి దిగారు.. ఉద్దానంలో పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు. అంతే, అక్కడితో ఆయన 'షో' అయిపోయింది. ఇప్పుడు మరో 'కొత్తా దేవుడు' ఉద్దానం కిడ్నీ బాధితుల వెతలపై గొంతు విప్పాడు. ఆయనే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌. ఆయన ఇప్పటికే పలుమార్లు ఉద్దానం సమస్యపై స్పందించారు. కానీ, స్పందించాల్సింది పాలకులు. విపక్షాల పని, సమస్యను ఎలివేట్‌ చేయడమే. ఆ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే వుంటుంది. 

విపక్షాలు రాజకీయం చేస్తోందని అధికార పక్షం.. అధికారంలో వున్నవారు నిర్లక్ష్యం వహిస్తున్నారని విపక్షాలు.. ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది. దేశంలో ఇంకెక్కడన్నా ఇలాంటి పరిస్థితి వుంటే, కేంద్రం ఇలాగే నిర్లక్ష్యం వహించేదా.? అన్న ఆవేదన కలుగుతుంటుంది.. ఉద్దానం బాధితుల వెతలు ప్రత్యక్షంగా చూస్తే. ఒకప్పుడు ఉద్దానం అంటే కొబ్బరి తోటలు. కోనసీమను తలపించేలా ఉద్దానం ఓ వెలుగు వెలిగేది. కానీ, ఇప్పుడు ఉద్దానం పరిస్థితి వేరు.  Readmore!

ఉద్దానం అంటే కిడ్నీ రోగం. నిజానికి ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్నది కిడ్నీ రోగం మాత్రమే కాదు.. అంతకు మించిన రాజకీయ రోగం. ఈ రోగానికి మందు వేసేదెవరు.?

Show comments