గంటాకు పొగ?

విశాఖలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ఎందుకు బయటకు వస్తున్నాయి. అక్కడ జరుగుతున్న భూ భాగోతాలను అధికార పార్టీ మద్దతు దినపత్రికలు కూడా ఎందుకు భయంకరంగా పోకస్‌ చేస్తున్నాయి? వందలాది ఎకరాలు, వేలాది కోట్లు అంటూ నిత్యం వార్తలు మైక్‌సెట్‌ సౌండ్‌లో ఎందుకు వినిపిస్తున్నాయి? వీటన్నింటి వెనుక టార్గెట్‌ ఒకటే అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.

అది మరేమిటో కాదు. మంత్రి గంటా శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం లేదా? పార్టీలోనే వుంటే, అతన్ని పక్కన పెట్టించడం. దీనివెనుక పార్టీకి చెందిన పెద్ద తలకాయలు ఇన్‌వాల్వ్‌ అయినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

గంటా శ్రీనివాసరావు పార్టీలోని మూడువర్గాలకు టార్గెట్‌ అయినట్లు వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో ఉభయచరం లాంటి వారు. ఆయనకు ఇటు కమ్మ, అటు కాపు వర్గాలతో బంధాలు, బాంధవ్యాలు వున్నాయి.

ఓట్లకు సంబంధించినంత వరకు కాపు కార్డును ఆయన చిరకాలంగా వాడుకుంటున్నారు. అలాగే రాజకీయాల్లో ఎదగడానికి కమ్మ, కాపు ఇలా ఏ కార్డు అవసరమైతే ఆ కార్డు వాడుతున్నారు. ఇప్పుడు ఇదే ఆయనకు రాజకీయంగా శతృవులను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ నగరానికి సంబంధించినంత వరకు రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యాపార పరంగా కమ్మ జనాలు పూర్తి పట్టు సాధించేసారు. స్థానికులు ఏనాడో పక్కకుపోయారు. అయితే విశాఖలోని కమ్మ నాయకులు రాజకీయంగా మంత్రులు మాత్రం కాలేకపోతున్నారు. కారణం, గంటా శ్రీనివాసరావు అడ్డంగా వుండడమే. చిరకాలంగా ఎమ్మెల్యేగా వుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు మంత్రి కాలేకపోతున్నారు.

ఎమ్మెల్సీగా మారిన మాజీ ఎంపీ, బాలయ్య బాబుకు అటు లోకేష్‌ బాబుకు సన్నిహిత బంధువు ఎమ్‌వివి ఎస్‌ మూర్తికి అదే ఆశ వుండనే వుంది. కానీ తెలుగుదేశం పార్టీలో కమ్మ-కాపు కోటాలో గంటానే మంత్రిపదవి పట్టుకుని వున్నారు. 2019 ఎన్నికల నాటికి గంటా పార్టీ వదిలేస్తారని ఆ మధ్య కొంత ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అలా వెళ్లే ఆలోచనలో గంటా లేరని టాక్‌ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే ఉత్తరాంధ్ర తెలుగదేశంలో ఇప్పటి వరకు బలమైన కాపు నాయకుడిగా గంటా మాత్రమే వున్నారు. లోకేష్‌ చేతికి పార్టీ పగ్గాలు అందిన తరువాత కళా వెంకటరావును ప్రోత్సహించడం అంచెలంచెలుగా అందలం ఎక్కించడం ప్రారంభమైంది. కళా వెంకటరావు తన పట్టు పెంచుకునే కార్యక్రమాన్ని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రారంభించారు.

మంత్రి అశోక్‌ వ్యతిరేక వర్గానికి అండగా వుండడం మొదలయింది. ఇక గంటాను పక్కకు తప్పిస్తే విశాఖ జిల్లాపై కూడా పట్టు ప్రారంభమవుతుంది. అందుకే ఆయన మంత్రి అయ్యన్నకు బాసటగా వుంటున్నట్లు తెలుస్తోంది. పైగా ఎలాగూ కాపు(గంటా), వెలమ(అయ్యన్న) వైరం వుండనే వుంది. గంటా మళ్లీ పొరపాటున భీమిలి నుంచి తన మాజీ నియోజకవర్గం అయిన అనకాపల్లికి వెళ్తారేమో అన్న అనుమానంతో అక్కడ లాక్‌ చేయడానికి వీలుగా కొణతాల రామకృష్ణను పార్టీలోకి తేవాలని అయ్యన్న ప్లాన్‌ చేస్తున్నట్లు వినికిడి.  

ఆ విధంగా అటు విశాఖ సిటీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మవర్గానికి, ఉత్తరాంధ్రలో కాపువర్గానికి గంటా శ్రీనివాసరావు టార్గెట్‌గా మారారు. నిజానికి విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూదందాలో అన్ని వర్గాలు వున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైకాపా అని కాకుండా కాస్త అంగబలం, అర్థబలం, పలుకుబడి వున్నవారు ఎవరి స్థాయిలో వారు, ఎవరికి అందినవి వారు చకచకా చేజిక్కించుకున్నారు.

ఇది ఇవ్వాళో, నిన్నో జరగలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఉత్తరక్షణం నుంచి ప్రారంభమయింది. చిత్రమేమిటంటే అందులో లోకేష్‌ అనుకూల వర్గమూ వుంది. లోకేష్‌ వర్గం టార్గెట్‌ చేయాలనుకున్న వర్గమూ వుంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు భాజపాలో కీలక స్థాయిలో వున్న వారి సన్నిహితులూ వున్నారు. కానీ ఇక్కడ రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు వుండడంతో కాస్త కష్టమైనా, నష్టమైనా భూ భాగోతాన్ని భాజపా కూడా వ్యతిరేకిస్తోంది.

గంటాకు వున్న చిన్న అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు ఇంకా పూర్తిగా గంటాకు వ్యతిరేకం కాకపోవడం. పార్టీలో ఏం జరుగుతోందో, విశాఖ వ్యవహారాల వెనుక లోకేష్‌ హస్తం వున్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే గంటాను పూర్తిగా పక్కన పెట్టడంలేదు. ఇదే అదనుగా గంటా నేరుగా చంద్రబాబునే రంగంలోకి దించాలని చూస్తున్నారు. విశాఖలో తెలుగుదేశం జనాలు, ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు నేరుగా గంటాను టార్గెట్‌ చేస్తున్నారు.

ఈ వ్యవహారం మొత్తం పార్టీకి చేటు చేస్తుందన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ దీన్ని వదిలేయలేరు. తన మద్దతు అందించలేరు. అందుకే వీలయినంత జాగ్రత్తగా టాకిల్‌ చేయడానికి టోటల్‌ వ్యవహారాన్ని తన చేతిలోనే వుంచుకున్నారు. వీలయినంత సాగదీయాలన్నదే బాబు ఆలోచనగా తెలుస్తోంది. ఎలాగూ ఈ భూముల వ్యవహారాలు అన్నీ చిక్కుముడి పడిపోయాయి.

అన్నీ కలిపి గుత్తగా వార్తలు కనిపిస్తన్నాయి  కానీ, దేని కేసులు దానికి వున్నాయి. ఇవన్నీ కోర్టు మెట్లు దాటి బయటకు రావాలంటే ఏళ్లు పూళ్లు పడుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వం తెగించి, విడివిడిగా ఏవైనా జీవోలు తెచ్చినా అవీ కోర్టు మెట్లు ఎక్కుతాయి.

అందుకే ఈ చిక్కుముడి విప్పే ప్రయత్నం చేయడం కన్నా, ప్రభావం పడకుండా చేయడంపైనే బాబు దృష్టి సారించారు. ఈ సంగతి గమనించే గంటా ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అయ్యన్న అండ్‌ కో చేస్తున్న భూదందా ప్రచారం వల్ల పార్టీ పరువు బజార్న పడుతోందంటూ బాబుకే విన్నవిస్తున్నారు. కానీ ఒకటే సమస్య.

2019 ఎన్నికల నాటికి గంటాను సాగనంపుతారా? అలా వుంచుతారా? అన్నదే. తెలుగుదేశం పార్టీ జనాల సమాచారం అయితే ఒకటే. గంటాను అలా పార్టీలో వుంచి, ఎన్నికల ఫలితాలను బట్టి, గంటాను అలా పక్కన వుంచడమో, మరోటో అన్నది ఆలోచిస్తారు. అయితే అవసరం అయితే గంటా జంప్‌ జిలానీ అనడానికి వన్‌మినిట్‌ కూడా సందేహించరన్నది ఆయన ట్రాక్‌ రికార్డు చెబుతున్న సత్యం.

అందువల్ల జనసేన వైపో, లేదా వైకాపా వైపో వెళ్తారేమో అన్న అనుమానం వుండనే వుంది. అందుకే ఈ భూదందా మొత్తాన్ని గంటాకు ఆపాదించే ప్రయత్నం మాత్రం ఆగలేదు. రేపు అవసరం అయితే గంటాను అటాక్‌ చేయడానికి ఈ అస్త్రాలు మరోసారి పనికి వస్తాయి.

అయితే గంటా కూడా తన స్ట్రాటజీలో తాను వున్నారని వినికిడి. తన కులం కార్డు, తన ఆర్థిక బలాన్ని ఆయన నమ్ముకున్నారు. దానికి ఏ పార్టీ మద్దతు కాస్త వున్నా, గెలుపు బాటను సులువుగా అందుకోగలనన్నది గంటా ధీమా. మొత్తానికి విశాఖ రాజకీయం రంజుగా గంటా చుట్టూ తిరుగుతోంది.

-ఆర్వీ

Show comments