సింధు గోల్డ్‌ మెడల్‌.. చంద్రబాబు ఘనతే.!

బిల్‌ గేట్స్‌కీ, సత్య నాదెళ్ళకీ 'హైటెక్‌' పాఠాలు నేర్పించింది నారా చంద్రబాబునాయుడుగారే.. 

బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న సింధు వెనుక ఎవరున్నారో తెలుసా.? ఇంకెవరు చంద్రబాబునాయుడుగారే.. 

ఎవరేమనుకుంటేనేం, తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు చంద్రబాబు. నలుగురూ నవ్విపోతారు.. అన్న ఆలోచన చంద్రబాబుకి ఏమాత్రం వుండదు. లేకపోతే, పీవీ సింధు ఒలింపిక్స్‌లో సత్తా చాటడానికి చంద్రబాబు కారణమేంటి.? ప్రపంచానికి సాఫ్ట్‌వేర్‌ పాఠాలు నేర్పిన బిల్‌ గేట్స్‌ వెనకాల చంద్రబాబు వుండటమేంటి.? సత్య నాదెళ్ళ సాధించిన ఘనవిజయాల తాలూకు క్రెడిట్‌ తనదేనని చంద్రబాబు చెప్పడమేంటి.? 

అప్పుడెప్పుడో.. చంద్రబాబు హయాంలో, ఆయనగారు పుల్లెల గోపీచంద్‌ అకాడమీ కోసం స్థలాన్ని కేటాయించారట. తద్వారా గోపీచంద్‌ని ప్రోత్సహించారట. ఆ గోపీచంద్‌ కట్టిన అకాడమీ ద్వారా పీవీ సింధు ఎదిగింది గనుక, ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది గనుక, ఆ ఘనత తనదేనని చంద్రబాబు చెప్పేసుకున్నారు. నవ్విపోదురుగాక మనకేటి.. అన్న చందాన చంద్రబాబు వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా.?  Readmore!

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రెండేళ్ళయ్యింది. ఒలింపిక్స్‌ని లక్ష్యంగా పెట్టుకుని (ఈ ఒలింపిక్స్‌ కాకపోయినా, తదుపరి ఒలింపిక్స్‌ కోసం అయినా సరే) ఎంతమంది క్రీడాకారుల్ని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో సమాయత్తం చేస్తున్నారట.? ఇదిగో, ఈ పది మంది.. ఇన్ని విభాగాల్లో ఒలింపిక్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తయారవుతున్నారు.. అని చంద్రబాబు చెప్పగలరా.? ఛాన్సే లేదు.! 

ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండింగ్‌ అయితే, దాన్ని తన ఘనతగా చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకోవడం అలవాటు చేసేసుకున్నారు. ఏం చెయ్యలేం, ఆయనంతే అదో టైపు.!

కొసమెరుపు: ఇంకా సింధు గోల్డ్ మెడల్ సాధించలేదు.. కానీ, సాధించేలానే వుంది.. చంద్రబాబే, ఇంకా ఆ మెడల్ తన దయతోనే వచ్చిందని చెప్పెయ్యలేదు.!

Show comments