టీడీపీ నేతల జీవితాలతో అనుకూల మీడియా ఆటలు!

ఆఖరికి సొంత మీడియాను నమ్మకూడదు.. అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఏ పత్రికలు అయితే తమ పార్టీని భుజాన వేసుకుని మోస్తున్నాయో, ఏ పత్రికలు అయితే తమ పార్టీకి అనుదినం జాకీలేస్తూ పరువు కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయో.. ఏ పత్రికలు, ఏ టీవీ చానళ్లైతే.. తాము నవ్వుల పాలవుతూ తెలుగుదేశం పార్టీ ని, చంద్రబాబు నాయుడిని హైప్ చేసే పనిలో అవిశ్రాంతంగా పని చేస్తున్నారో.. అవే పత్రికలు తమ జీవితాలతో ఆటలు ఆడుతున్నాయని కొంతమంది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం. ఇది జరిగిపోతోందని.. ఇక జరగడం లాంఛనమేనని గత వారం పది రోజుల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రత్యేక కథనాలు రాస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది, పునర్విభజన జరిగిపోతున్నట్టే.. ఇక ఏం ఫికర్ లేదు.. అన్నట్టుగా టీడీపీ బ్యాండ్ బాజా మీడియా రోజూ పంపు కొట్ట సాగింది. రాజ్ నాథ్ చెప్పాడని ఒక రోజు, హోంశాఖ సహాయ మంత్రి ధ్రువీకరించారని మరో రోజు, హోంశాఖ కార్యదర్శి పేరిట ఇంకోరోజు.. అమిత్ షా, మోడీ.. ఇలా అందరి పేర్లనూ వాడుకుని.. ప్రతి రోజూ క్రమం తప్ప కుండా ‘పునర్విభజనకు అంతా సానుకూలంగా ఉంది, నిర్ణయం అయిపోయింది.. రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది..’ అని మంచి నీళ్లు తాగినంత ఈజీగా కథనాలు రాశాయి టీడీపీ అనుకూల మీడియా వర్గాలు.

మరి పునర్విభజన జరగడం అంటే.. మరో ఐదేళ్ల పాటు అధికారం తెలుగుదేశం చేతుల్లోకి రావడం అనేంత ఆనంద పడుతున్నాయి ఈ మీడియా వర్గాలు. మరి ఆ కథనాలు అన్నీ.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందు రోజు వరకూ సాగినవి. మరి ఎన్డీయే మీట్ కు అని చంద్రబాబు ఢిల్లీ వెళ్లాకా.. ఈ మీడియా వర్గాల కథనాల్లో ఒక లైన్ ఏమిటంటే.. ‘నియోజకవర్గాల పునర్విభజన చేయాలని.. బీజేపీ అగ్రనేతలను కోరారు..‘ అనేది. మరి బాబు ఢిల్లీ టూర్ కు ముందే సుజనా చౌదరి చక్రం తిప్పేశాడు.. వెంకయ్య వాక్రుచ్చాడు.. అంతా అయిపోయింది.. వీలైతే బడ్జెట్ సమావేశాల్లోనే సభలో బిల్లు.. డ్రాఫ్టు కూడా రెడీ అయిపోయింది.. అని పచ్చ పేపర్లు కథనాలు వండాయి. కట్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు పునర్విభజన గురించి చంద్రబాబు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకూ పునర్విభజన గురించి ఆలూ లేదు చూలూ లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనల ప్రకారం అయితే.. అసలు పునర్విభజన ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. ఆ విషయాన్ని హోంశాఖ ప్రకటిచేసింది కూడా. పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటనలు.. తెలుగుదేశంలోని నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఇప్పుడు గనుక పునర్విభజన జరగకపోతే.. చాలా నియోజకవర్గాల్లో నంద్యాల తరహా పరిస్థితులు ఏర్పడతాయి. మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి తమ్ముళ్లు కొట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆందోళనతో ఉన్న వారిని ఊరడించడానికే తెలుగుదేశం అనుకూల మీడియా పునర్విభన జరిగిపోతోందనే భజనను అందుకుంది. అందుకు సంబంధించి రోజుకో కథనం వండి వార్చింది. తీరా .. బాబు ఢిల్లీ టూర్ లో ‘కనీసం ఆర్డినెన్స్ జారీ చేసైనా పునర్విభజన చేపట్టండి..’ అని విన్నవించుకోవడంతో అసలు కథ బయటపడిపోయింది. పునర్విభజన జరిగే ఛాన్సెస్ ఏ మాత్రమున్నాయో అర్థమయ్యేలా చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు.. అనుకూల మీడియా తీరును శంకిస్తున్నారు. తమను మోసం చేయడానికే సొంత మీడియా పని చేస్తోందని.. ఫిరాయింపుదారుల నుంచి టెన్షన్ ను ఎదుర్కొంటున్న తమ్ముళ్లు వాపోతున్నారు.

Show comments