జీఎస్టీ పన్ను తగ్గించకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని సీనియర్ నటుడు కమల్‌హాసన్ అల్టిమేటం జారీ చేశాడు. సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకు జీఎస్టీ పన్నుని ఏకంగా 28 శాతానికి కేంద్రం ఫైనలైజ్ చేసింది. దీన్నే ప్రశ్నిస్తున్నాడు కమల్‌హాసన్. కమల్‌హాసన్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత, దర్శకుడు కూడా. అందుకే, సినీ పరిశ్రమలోని సమస్యలపై వీలు చిక్కినప్పుడల్లా గళం విప్పుతూనే వున్నాడు.
ఇప్పటిదాకా ఒక లెక్క, జీఎస్టీ వచ్చాక ఇంకో లెక్క. సినీ పరిశ్రమలో పన్నుల వ్యవహారంపై చాన్నాళ్ళుగా ఆందోళన జరుగుతోంది. 'వినోదపు పన్ను మినహాయింపు' విషయమై ఎప్పటికప్పుడు నిర్మాతలు, ప్రభుత్వాల ముందు దేబిరించాల్సిన దుస్థితి. అసలంటూ ఎక్కడా లేనంత పన్నుల భారం సినీ పరిశ్రమలోనే వుందని సినీ నిర్మాతలు వాపోతుంటారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందడంలేదనే ఆవేదన సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో వుంది.
'సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం..' అని ప్రభుత్వంలో ఎవరున్నా చెబుతుండడం చూస్తూనే వున్నాం. ప్రభుత్వ ఖజానాకి సినీ పరిశ్రమ నుంచి వివిధ మార్గాల్లో పెద్ద మొత్తం జమ అవుతున్నాసరే, సినీ పరిశ్రమని ప్రభుత్వాలు లైట్ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జీఎస్టీ పేరు చెప్పి సినీ పరిశ్రమకు ఓ అవకాశం దక్కింది.
కమల్ ప్రశ్నించాడు.. ఇంకా స్పందించాల్సినోళ్ళు చాలామందే వున్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసీ చేసీ విసిగిపోయిన సినీ జనం, ఇప్పుడు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో కొంత ఊరట లభించే అవకాశముంటుంది. కానీ, సినీ పరిశ్రమలో ఆ ఐక్యత ఎక్కడిది.? పైరసీ విషయంలోనే సినీ పరిశ్రమ ఐక్యత ప్రదర్శించిన దాఖలాలు చాలా చాలా అరుదు.
పేరుకి ఆయా సినీ పరిశ్రమల్లో విడివిడిగా సంఘాలున్నాయి.. దక్షిణాది సినీ పరిశ్రమ అంతటికీ ఓ సంఘం వుంది.. అయినా ఏం లాభం.? ఆ సంఘాలన్నీ, ఇప్పుడు స్పందిస్తేనే కదా ఉపయోగం.!