ఈ ప్రశ్నకు బదులేది.?

కొన్ని విషయాల్లో కేవలం ప్రశ్నలే వుంటాయి.. జవాబులు మాత్రం దొరకవు. జవాబులు లేక కాదు, వాస్తవాల్ని కప్పిపుచ్చాలి గనుక.. ఆ జవాబుల్ని మరుగున పడేస్తారంతే.! 

తెలుగు రాజకీయాల విషయానికొస్తే, స్వర్గీయ నందమూరి తారకరామారావు మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆయనపై విష ప్రయోగం జరిగిందన్నారు అప్పట్లో కొందరు. ఎన్టీఆర్‌ డెత్‌ మిస్టరీపై ఆయన కుటుంబ సభ్యులే అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఆ అనుమానాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. ఇది పైకి కనిపించే వాస్తవం. కానీ, నిజమేంటి.? అదెప్పటికీ బయటకు రాదు. 

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత డెత్‌ మిస్టరీ కూడా అంతే. ఆమెపై విష ప్రయోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 74 రోజులపాటు ఓ ముఖ్యమంత్రిని ఆసుపత్రిలో పెట్టి, ఆమె ఆరోగ్య పరిస్థితిని పూర్తి సస్పెన్స్‌లో వుంచి, చివరికి 'ఆమె చనిపోయారు' అనే విషయాన్ని బయటపెట్టారు. ఈ ఒక్కటి చాలు, జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ వుందని చెప్పడానికి. 

సరిగ్గా రెండు నెలల తర్వాత, జయలలితకు వైద్య చికిత్స అందించిన వైద్యులు మీడియా ముందుకొచ్చారు. ఏవేవో చెప్పేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఫొటోలెందుకు బయటపెట్టలేదు.? అంటే, మేం డాక్టర్లం మాత్రమే.. ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆ వివరాలు అడగండి.. అని ఉచిత సలహా ఇచ్చారు డాక్టర్లు. 

జయలలిత మొహంపై చిన్నపాటి గాయం కన్పించడం గురించీ, స్థానిక ఎన్నికల సమయంలో జయలలిత వేలి ముద్రలు వేయించడం గురించీ.. ఏవేవో చెప్పేశారు. ఆ వేలి ముద్రల వ్యవహారంతో వైద్యులకు సంబంధమేంటట.? ఏమో మరి, దాన్ని కూడా 'అది మాకు సంబంధం లేని వ్యవహారం' అనేయకుండా వివరణ ఇచ్చినందుకు సంతోషం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు శశికళకు సమాచారమిచ్చారట. అదేంటో మరి, మామూలుగా అయితే కుటుంబ సభ్యులకి కదా సమాచారమివ్వాల్సింది.? 

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌ సెల్వం రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందిన రోజే, జయలలితకు వైద్య చికిత్స అందించిన వైద్యులు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు.? ఇది కదా అసలు సిసలు పాయింటు.! చిన్నమ్మ.. అదేనండీ, కాబోయే ముఖ్యమంత్రి శశికళ, జయలలిత డెత్‌ మిస్టరీకి సమాధి కట్టేసేందుకే ఈ మొత్తం ఎపిసోడ్‌ని తన కనుసన్నల్లో నడిపించారన్నది సుస్పష్టం. 

జయలలిత వైద్య చికిత్స కోసం ఐదున్నర కోట్లు ఖర్చయ్యిందట. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కూడా, ఆమెను ఐసీయూ గది బయటనుంచి అద్దాల్లోనే చూశారట. ఇదండీ వరస. రాజకీయం ఏమైనా చేస్తుంది.. ఓ ముఖ్యమంత్రినిలా మాయం చేస్తుంది.! ఇప్పుడు చెప్పండి, జయలలిత మరణంతో.. సవాలక్ష వాస్తవాలు కూడా సమాధి అయిపోయాయా.? లేదా.?

Show comments