బాబుకే అస్పష్టత...ఎంపీలేంచేస్తారు?

సామాన్యుడు కావొచ్చు, రాజకీయ నాయకుడు కావొచ్చు ఎవరైనా సరే స్పష్టమైన అభిప్రాయాలుండాలి. చిన్నాచితకా విషయాల్లో ఉన్నా ఉండకపోయినా జీవితాలను మలుపు తిప్పే కీలకమైన అంశాల్లో క్లారిటీ లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సామాన్యుల సంగతి పక్కన పెడితే పార్టీకి, ప్రభుత్వానికి నాయకత్వం వహించే పెద్దమనిషికి ప్రతి అంశంలోనూ స్పష్టత ఉండాల్సిందే. ఆయనకు స్పష్టత ఉంటేనే నాయకులకు, పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టత ఉంటుంది. అప్పుడే ఎక్కడైనా ఒకే మాట మాట్లాడతారు. 

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కమ్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టత లేదు. కాని ఆయన రాజ్యసభలో సరిగా వ్యవహరించలేకపోయారని ఎంపీలకు క్లాసు తీసుకున్నారట...! అధినాయకుడే ప్రత్యేక హోదాపై పది రకాలుగా ఇప్పటివరకు మాట్లాడారు. ఆయనే అలా మాట్లాడినప్పుడు ఎంపీలు పార్లమెంటులో కుండ బద్దలు కొట్టినట్లు, మొహాన గుద్దినట్లు ఎలా మాట్లాడగలరు. తాడోపేడో తేల్చుకునేలా మాట్లాడాలని తాను ముందుగానే సమాచారం ఇచ్చానని ఈయనంటే, ఆ సమాచారం ఆలస్యంగా అందినందువల్ల తాము గోడ మీద పిల్లివాటంగా మాట్లాడామని వాళ్లు అన్నారట...! ఈ ప్రహసనాన్ని ఓ 'పచ్చ' పత్రిక రాసింది. 

టెక్నాలజీ హిమాలయమంత ఎత్తుగా ఎదిగిన ఈ రోజుల్లో 'మీ సమాచారం అందలేదు' అని ఎంపీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రం పైనా, సభలో సరిగా మాట్లాడనందుకు, వెల్‌లోకి దూసుకుపోయి సర్కారును నిలదీయనందుకు ఎంపీలపైనా బాబు తీవ్రంగా ఆగ్రహించినట్లు ఆ పత్రిక రాసింది. 'నేను సుజనాకు ముందుగానే తగినంత సమాచారం పంపాను. నా ఆదేశాలు మీకు సకాలంలో అందేలా మీరక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు వెల్‌లోకి వెళ్లి నిలదీయాలి కదా. రాష్ట్రం తరపున బాధ్యతను మీకొకరు గుర్తు చేయాలా?'...అని బాబు ఎంపీలకు తీవ్రంగా క్లాసు పీకారట...! ఈయన వారికి మీరు ఫలానావిధంగా వ్యవహరించాలని ఆదేశించడం, ఆదేశాలు వారికి అందకపోవడం విచిత్రంగా ఉంది. 

ఒకపక్క తాను ఆదేశాలు ఇచ్చానని చెప్పిన సీఎం, మరోపక్క ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించాలన్నట్లుగా మాట్లాడారు. కేంద్ర సర్కారులో భాగస్వామి అయిన పార్టీ ఎంపీలు స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తారు? ఒకవేళ అలా చేశారే అనుకుందాం. నా ఆదేశాలు లేకుండా మీరెందుకు మాట్లాడారని బాబు అనడని గ్యారంటీ ఏమిటి? మొత్తం మీద ప్రత్యేక హోదాపై సరిగా మాట్లాడలేదంటూ తప్పంతా ఎంపీల మీద తోసేశారు చంద్రబాబు. ఇలా వ్యవహరించడం ఆయనకు అలవాటే. తాను 'ఉత్తమ'...ఎదుటివాడు 'అధమ' అనే అభిప్రాయం కలిగిస్తారు. 

ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లుగా బాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నవారికి, చేసిన కామెంట్లు విన్నవారికి 'నెత్తురు మరిగిపోతోంది' అని బాబు అన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మశక్యంగానూ అనిపించడంలేదు. ప్రత్యేక హోదా రాకపోయినా, అందుకోసం ప్రయివేటు మెంబర్‌ బిల్లు పెట్టి రాజ్యసభను కుదిపేసిన, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన కాంగ్రెసు పార్టీకి ప్రజల్లో సానుకూలత ఏర్పడే అవకాశముంది. బహుశా ఈ భయంతోనే తాను కేంద్రంపై మండిపడినట్లు, 'పొమ్మంటే మంత్రివర్గం నుంచి బయటకు పోదాం' అని అన్నట్లు 'పచ్చ' పత్రికలో రాయించుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 

ఎందుకంటే  బాబు ఎంపీలతో వీడియా కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫలానా విధంగా మాట్లాడారని చెబితే తప్ప మీడియాకు తెలియదు. ఒకవేళ బాబు నిజంగా ఆగ్రహించారనే అనుకుందాం. మరి బీజేపీతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకుంటారా? దీనిపై ప్రకటన చేయగలరా? ప్రత్యేక హోదా విషయంలో అనవసరంగా (భాజపాకు కోపం తెప్పించేలా) మాట్లాడొద్దని గతంలో బాబు నాయకులను ఆదేశించారు. ఏదో రకంగా ప్రత్యేక హోదా తెచ్చుకుందామన్నారు. మోదీ సర్కారు స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు.   

ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామని,  సాధించడానికి ప్రయత్నిస్తామని ఓ పక్క చెప్పిన చంద్రబాబు,  మరో పక్క అది అంత అవసరం కాదని కూడా అన్నారు.  గత ఏడాది  శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ఓ పుస్తకం ప్రచురించింది. 'ప్రత్యేక హోదాపై ఆరోపణలు-వాస్తవాలు' అనే పేరుతో ప్రచురించిన ఈ పుస్తకం గందరగోళంగా ఉంది. ప్రత్యేక హోదా అవసరమని చెబుతూనే అది లేకపోయినా పెద్దగా నష్టం లేదనేది ఈ పుస్తకంలోని సారాంశం. 

రాష్ట్రానికి పదిహేనేళ్లపాటు ప్రత్యేక హోదా అవసరమని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అదే పుస్తకంలో ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, 750 కోట్ల రూపాయల గ్రాంట్లు తప్ప మరేం రాదని కూడా తెలియచేశారు. చంద్రబాబే ఇంత అస్పష్టంగా ఉన్నప్పుడు, కేంద్రాన్ని ధైర్యంగా నిలదీయలేనప్పుడు హోదాపై చర్చలో ఎంపీలు ఘాటుగా, సూటిగా ఎలా మాట్లాడతారు? 

Show comments