నవ నిర్మాణ దీక్షలకు జనం కరువు

గోదావరి జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలకు జనం కరువయ్యారు. జూన్‌ 2 నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలకు పిలుపు నిచ్చింది. ఓవైపు ఎండలు మండుతుండటం, మరోవైపు దీక్షల పిలుపు జనానికి అంతగా కనెక్ష్‌ కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో జనం లేక సభలు వెలవెలబోయాయి. 
ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీకి ఉన్నప్పటికీ సభలు పేలవంగా జరుగుతుండటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.

నవనిర్మాణ దీక్ష నేపథ్యంలో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లి గూడెం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల వివరాలను వివరిస్తూ పెద్దఎత్తున హోర్డింగ్‌లు, బ్యానర్లను ప్రభుత్వ మంత్రాంగమే ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేందుకు భారీ హోర్డింగ్‌లను ఏర్పాటుచేశారు. ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు సహా ప్రధాన రహదారులకు పెయింటింగ్‌లు వేసి, రంగు రంగుల చిత్రాలను అలంకరిస్తుంటారు.

2014 జూన్‌ నుండి 2017 మే 31వ తేదీ వరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని వివరించేందుకు నవ నిర్మాణ దీక్షలను వేదికగా తీసుకున్నారు. దీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులే చూసుకున్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం వ్యక్తిగత పనులకు పరిమితమై, పార్టీ కార్యక్రమానికి అంతగా ప్రాధాన్యతనివ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతల పరిస్థితి ఇలావుంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల ఫ్లీనరీ సమావేశాలతో బిజీ అయ్యారు.

నియోజకవర్గాల భారీగా జరుగుతున్న పార్టీ ఫ్లీనరీ సమావేశాల్లో ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై నిరసన గళం విప్పుతున్నారు. ఫ్లీనరీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యతనిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సహా పలు నియోజకవర్గాల్లో జరిగిన ఫ్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తూ, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనా వేస్తూ, వివిధ తీర్మానాలను చేస్తూ, అధినేత జగన్‌ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. Readmore!

పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగదేశం హవా కొనసాగడంతో ఆ జిల్లాపై పట్టు సాధించేందుకు వైకాపా వ్యూహ రచన చేశారు. అలాగే కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని, అయితే ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధవంతంగా ప్రజల్లో ఎండగట్టలేని దుస్థితి ఏర్పడిందని వైకాపా నేతలు మదనపడుతున్నారు. ఇక నుండైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ప్రధాన అజెండాగా పనిచేయాలని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలకు హితవు చేస్తున్నారు.

Show comments

Related Stories :