అసలు కథ ఇప్పుడు మొదలైంది బాబూ..

పట్టిసీమ..చంద్రబాబు మానస పుత్రిక..ఈ ప్రాజెక్టు కోసం బాబు కిందా మీదా అయిపోయారు. ఎవ్వరు అడ్డం పడ్డా అస్సలు పట్టించుకోలేదు. ఇందులో అవినీతి అని జగన్ అండ్ కో గొంతు చించుకుంటే, వాళ్లపై విరుచుకుపడ్డారు. రాయలసీమకు నీళ్లివ్వడం జగన్ కు ఇష్టం లేదు అన్నారు. పట్టి సీమ పూర్తయితే జగన్ అండ్ ఆయన పార్టీ అవుట్ అన్నారు.

గోదావరి నీళ్లు కృష్ణాకు పట్టకుపోతుంటే ఈస్ట్ వాళ్లు కాస్త కిందా మీదా అయినా, వారి వాయిస్ ను వినిపించకుండా చేసింది బాబు అనుకూల మీడియా. మొత్తానికి పట్టిసీమ పూర్తయింది అనిపించారు. పూజలు, పురస్కారాలు, పసుపు కుంకుమలు, హారతులు, అపర భగీరథుడు బాబు అంటూ కీర్తనలు.

సరే ఇంతకీ గోదావరి జలాలు కృష్ణ డెల్టాకు ఇచ్చి, సాగర్ జలాలు ఏ మేరకు రాయలసీమకు తరలించారో ఎవరికైనా తెలుసా? ఎక్కడయినా ఆ వార్త కనిపించిందా? అబ్బే లేదంటే లేదు. సీమ కోసమే పట్టిసీమ అన్నంతగా హడావుడి చేసిన వారు మళ్లీ మాట్లాడిన దాఖలాలు వున్నాయా? అబ్బే అదీ లేదు. సరే, ఈ లోగా సాగర్ జలాల గురించి తెలంగాణ, ఆంధ్ర కిందా మీదా అవ్వడం ప్రారంభమైంది. ఈ రంథిలో పడి రాయలసీమ కు నీళ్లివ్వాలన్న సంగతే మరిచారు.

ఇదిలా వుంటే..పట్టిసీమ మీద ఆది నుంచీ కొంత మంది జనాలకు ఓ డవుట్ కొట్టేసేది. నిజంగా బాబు సీమ మీద ప్రేమ సంగతి అలా వుంచి, కృష్ణాడెల్టా కోసమే చేస్తున్నారా ఇదంతా అని? లేదూ అమరావతి రాజధానికి, అక్కడ రావాల్సిన బోలెడెన్ని సంస్థలకు భవిష్యత్ లో నీటి కొరత రాకుండా దీన్ని ప్లాన్ చేస్తున్నారా? అని అలా అంటే ఈస్ట్ గోదావరి జనాలు గోల పెడతారేమో అని రైతుల పేరు, సీమ పేరు వాడుకున్నారా అని?

ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అనిపించే వార్తలు వినిపిస్తున్నాయి. పట్టి సీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అన్నా కూడా, ఆ మాట వినకుండా కేంద్ర జల సంఘం పట్టిసీమకు వేరేగా మార్గదర్శకాలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణ డెల్టాకు తరలించే గోదావరి మిగులు జలాలను వ్యవసాయ అవసరాలకు కాకుండా, కేవలం ఆ ప్రాంతపు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడుకోవాలని జలసంఘం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి ఇలాంటి ఆదేశాలు వచ్చాయా? లేకా ఇద్దరు నాయుడు లు కలిపి రప్పించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగల కార్యాన్ని కేంద్ర జలసంఘం ద్వారా చేయించినట్లు కనిపిస్తోందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏముంది పట్టిసీమ జలాలు పారిశ్రామిక అవసరాలకు. అవి లేవు కాబట్టి ఎప్పటి లాగే సాగర్ జలాలు కృష్ణ డెల్టాకు. ఇక నష్టపోయేది ఎవరు? ఎప్పటిలాగే సీమ వాసులే.

అయినా సీమ సింహాలు, పులులు ఇప్పుడు ఘర్జించే స్థితిలో ఎలాగూ లేవు. పదవులో, పైసలో, ఏవొ ఒకటి అడ్డం పడతాయి గొంతుకకు.

Show comments