సరదాకి: నేనే నేనే నేనే హీరో.!

క్వశ్చన్‌: పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానిదా.? కేంద్రానిదా.? 

ఆన్సర్‌: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. 

ఒకటో తరగతి కుర్రాడికి కూడా తెలిసిన విషయమే ఇది. కానీ, 'పోలవరం ప్రాజెక్టు నా బాధ్యత..' అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. మంచిదే, ముఖ్యమంత్రి పట్టువదలని విక్రమార్కుడిలా పోలవరం ప్రాజెక్టు బాధ్యతని తీసుకుంటానంటే ఎవరైనా కాదనగలరా.? కేంద్రం నుంచి నిధులు రాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే, అది చారిత్రాత్మకమవుతుంది. 

కానీ, అసలు విషయం అది కాదు. చంద్రబాబు దృష్టిలో పోలవరం ప్రాజెక్టు అంటే దానికున్న ప్రయార్టీలు వేరు. ముందుగా పట్టిసీమ, ఆ తర్వాత పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాలు. పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేసేశారు.. అదీ రికార్డు సమయంలో. దానికి ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆ లెక్కన, పట్టిసీమ గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కాల్సిన ఎత్తిపోతల పధకం. ప్రస్తుతం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాన్ని కూడా పట్టిసీమలానే ప్లాన్‌ చేస్తున్నారు.  Readmore!

ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు ఏమయ్యిందట.? అంటే, దానికి సంబందించే కదా, పట్టిసీమ -పురుషోత్తపట్నం పనుల్ని పూర్తి చేస్తున్నది.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్నాయి నొక్కులు దర్శనమిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం నుంచి తగిన రీతిలో ఆర్థిక సహాయం అందడంలేదు. దాంతో, చేసేది లేక 2018 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్నట్లు కొత్త వాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తెరపైకి తెచ్చారు. కఫర్‌ డ్యామ్‌ని పూర్తి చేయడం మొదటి దశ అన్నమాట. ఇది కూడా ప్రాజెక్టులో భాగమే. ఇంజనీరింగ్‌ నిపుణులు ఈ వాదనతో ఏకీభవిస్తున్నార్లెండి. 

పోనీ చంద్రబాబు అనుకుంటున్నట్లుగా అయినా పోలవరం ప్రాజెక్టు పనులు (కఫర్‌ డ్యామ్‌ వంటివి.. పోలవరం అసలు ప్రాజెక్టు కాదు) పూర్తవుతున్నాయా.? అంటే అదీ లేదు. సోమవారాన్ని పోలవారంగా మార్చేసిన చంద్రబాబు, ఆ రోజు పక్కాగా ప్రాజెక్టుని సమీక్షిస్తున్నారు.. అది కూడా విజయవాడనుంచే. అదేదో వర్చ్యువల్‌ మానిటరింగ్‌ అట. ఎంతైనా హైటెక్‌ బాబు కదా, ఆ మాత్రం హంగామా వుండాల్లెండి. 

'అన్ని పనులూ నేనే చూసుకోవాలా.?' అంటూ కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేసేశారు చంద్రబాబు. అసహనమెందుకు, అల్టిమేటం జారీ చేసేసి, డెడ్‌లైన్లు పెట్టేయొచ్చు కదా.! అనుకున్నట్లు పనులు జరగడంలేదని చంద్రబాబే చెబుతున్నారు. అయినా అదే కాంట్రాక్టర్లను ఎందుకు కొనసాగిస్తున్టన్లు.? చేతిలో చిల్లిగవ్వ లేదుగానీ, 'నిధుల కొరత లేదు..' అంటూ సమీక్షలో చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం గురించి ఎలాగైనా మాట్లాడొచ్చుగాక. కానీ, కఫర్‌ డ్యామ్‌ కట్టేసి, ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే ఎలా.? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తే చంద్రబాబు గుస్సా అవుతారు. ప్రాజెక్టు పనులు జరగడంలేదని చంద్రబాబు అనొచ్చు, అదే మాట ప్రతిపక్షం నుంచి రాకూడదు. ఇక్కడ చంద్రబాబు హీరో.. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. నిధుల్లేవు కదా, ఎలా ప్రాజెక్టు పూర్తి చేస్తారు.? అని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు గుడ్లురిమి చూస్తారండోయ్‌.! 

ఈ చంద్రబాబేమిటో.. ఆ పోలవరం ప్రాజెక్టేమిటో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం అర్థం కాని అదేదో భాష సినిమా చూస్తున్నట్టుంది. అందులో చంద్రబాబే హీరో.!

Show comments