చంద్రబాబు.. ఇంత అసమర్థత, ఇంత మోసమా!

అనుకున్నదే అయ్యింది.. రాయలసీమ వాసుల ఆందోళనే నిజమైంది.. శ్రీశైలం నుంచి జల దోపిడీ కి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో తనను మించిన వాడు లేడని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు కనీస మట్టానికి చేరకుండానే అక్కడ నుంచి జలదోపిడీ చేయడం ఖాయమైంది. ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు పది టీఎంసీల నీటినీ విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం అయ్యింది!

మరి ఈ పరిణామాన్ని గమనిస్తే.. తెలుగుదేశం అధినేత అంత అసమర్థుడు, మోసగాడు మరొకరు ఉండరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాయలసీమ వాసుల నుంచి. మరి మొన్నటి ఎన్నికల్లో ఆయనకు సీమలో కొన్ని జిల్లాలు అనుకూలంగా సీట్లను ఇవ్వలేదని కక్షగట్టారో లేక రాయలసీమ మీద ఆది నుంచి ఏమైనా కసి ఉందో  ఏమో కానీ.. చంద్రబాబు సీమ ప్రయోజనాలను దారుణంగా దెబ్బకొడుతున్నాడు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది టీఎంసీల నీళ్లను దిగువకు విడుదల చేయాలన్న నిర్ణయంతో బాబులోని మోసం, అసమర్థత రెండూ ఆవిష్కారం అవుతున్నాయని రాయలసీమ  వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. మొన్నటి వరకూ బాబు చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సీమ వాసులు. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లన్నీ రాయలసీమకే.. అని బాబు చాలా సార్లు ప్రకటన చేశాడు. అదంతా ‘పట్టిసీమ’ కోసం మాట్లాడిన మాట. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై వ్యతిరేకత వచ్చినప్పుడు బాబు రాయలసీమ సెంటిమెంటును దారుణంగా వాడుకున్నాడు. పట్టిసీమను కట్టేస్తే కృష్ణా డెల్టాకు శ్రీశైలం నీళ్లు అవసరం ఉండదని, ఆ ప్రాజెక్టు నీళ్లన్నీ సీమకే అని బాబు చెప్పుకొచ్చాడు. అలా కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఫలాలు అందుతున్నాయని పచ్చపేపర్లు మొత్తుకుంటున్నాయి.

అయితే.. ఇంతలోనే సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఫీలింగూ లేకుండా పతాక శీర్షికలకు ఎక్కించాయి పచ్చపేర్లు. పట్టిసీమతో ప్రయోజనాలు నిజమే అయితే మళ్లీ శ్రీశైలం నుంచి ఈ జలదోపిడీ ఏమిటి? అని ఒక్కటీ రాయలేదు. పట్టిసీమ నిర్మాణంతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ల న్నీ సీమకే అన్నారుగా .. ఈ ఏడాదే పట్టిసీమతో  ఆరంభమైంది.. అప్పుడే శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ కన్నమేంటి? నిలదీయడం లేదు! Readmore!

పట్టిసీమ ప్రాజెక్టు లో తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సీమ సెంటిమెంటును వాడిన చంద్రబాబు నాయుడు.. కేవలం మోసకారి మాత్రమే కాదు, అసర్థుడు కూడా అని ఇదే అంశం ద్వారా రుజువు అవుతోందని సీమ వాసులు మండి పడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తే.. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రకు నీళ్లు వదులుతాం.. అనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వం మొన్న ఈ డిమాండ్ చేసిందో లేదే.. శ్రీశైలం నుంచి నీటి దోపిడీకి బాబు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు! ఈ నీటి విడుదలతో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస మట్టానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించడమే కాదు.. పాతాళ గంగలో గుండ్లు తేలుతాయిక.. ఇంత దారుణ నిర్ణయమా!

ఎలాంటి వాదనకు, విజ్ఞప్తికి దిగలేదు.. తెలంగాణ కోరింది, చంద్రబాబు ఆమోదించాడు. మరి అదే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది నీటితో ఎన్ని గేమ్స్ ఆడుతోంది? పాలమూరు –రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల విషయంలో ఏపీ ప్రయోజనాలపై దెబ్బకొట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ఏమీ అనలేకపోయాడు. ఇప్పుడు మాత్రం శ్రీశైలం నుంచి నీళ్లు.. అనగానే విడుదల చేసేస్తున్నారు! ఇదీ తెలుగుదేశాధినేత సమర్థత! బాబు తీరు రాయలసీమ వాసులను కలిచి వేస్తోంది. మరీ ఇంత దారుణమా.. ఎగువన వర్షాలు పడుతున్నాయి, శ్రీశైలానికి జలకళ సంతరించుకుందన్న ఆనందాన్ని నిమిషమైన లేకుండా చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి తీరుతో ఆవేదన తప్ప సీమ వాసులకు ఇంకేం మిగులుతుంది?

-జీవన్ రెడ్డి.బి 

Show comments

Related Stories :