బాబు సర్కారులో ఉండలేం బాబోయ్‌....!

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను గొప్ప పరిపాలకుడినని  చెప్పుకుంటూ ఉంటారు. నిప్పులాంటి మనిషినని, అత్యంత నీతిపరుడినని ప్రచారం చేసుకుంటుంటారు. పరిపాలనలో కొత్త పుంతలు తొక్కుతున్నానని, టెక్నాలజీని బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నానని, పారదర్శకత తన ప్రాణమని అంటుంటారు. మరి ఇంత నీతిపరుడైన ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి ఐఏఎస్‌ అధికారులు ఎందుకు ఇష్టపడటంలేదు? బాబు సర్కారులో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారుల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లు చాలాసార్లు మీడియాలో కథనాలొచ్చాయి. 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు'...అని సామాన్యులు పాడుకున్నట్లుగా 'మేం ఉండలేం బాబోయ్‌ మీ సర్కారులో'...అని ఐఏఎస్‌ అధికారులు మొత్తుకుంటున్నట్లు మరోసారి సమాచారం వచ్చింది. బాబు సర్కారులో పనిచేయడం ఇష్టంలేని   సివిల్‌ సర్వీసు అధికారులు ఏరికోరి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

    అవినీతి పనులు చేయలేమంటున్నారు 

     రాష్ట్ర విభజన జరిగినప్పుడు సకల సౌకర్యాలున్న హైదరాబాదును వదిలి ఏపీకి వెళ్లాల్సివస్తుందనే భయంతో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికే కొందరు సుముఖత వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేయడానికి ఒప్పుకున్న వారు హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే కదిలే పని ఉండదులే అనుకున్నారు. కాని నోటుకు ఓటు కేసు తరువాత చంద్రబాబు ఆగమేఘాల మీద రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సచివాలయం నిర్మించడం, పరిపాలన మూడేళ్లు కూడా పూర్తికాకముందే హైదరాబాదులోని ఏపీ పరిపాలనను (సచివాలయం) పూర్తిగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలించడంతో ఉన్న ఐఏఎస్‌ అధికారులు హతాశులయ్యారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదును వదలివెళ్లడానికి సాధారణ ఉద్యోగులతో సహా అధికారులెవరూ ఇష్టపడలేదని అందరికీ తెలుసు. చివరకు అయిష్టంగానే ఉద్యోగులు, అధికారులు వెలగపూడి సచివాలయానికి తరలాల్సివచ్చింది. అలా తరలిపోయే సమయంలోనూ కొందరు ఐఏఎస్‌ అధికారులు అక్కడికి వెళ్లడం ఇష్టం లేక కేంద్ర సర్వీసులకు ప్రయత్నాలు చేసుకున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. మొత్తం మీద సచివాలయం వెలగపూడిలో స్థిరపడి చాలాకాలమైంది. అయినప్పటికీ ఇంకా అనేకమంది ఐఏఎస్‌ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. మనసును కుదుటపరుచుకొని వెలగపూడి వెళ్లిన అధికారుల్లో అసంతృప్తి రగలడానికి ప్రధాన కారణం ఏపీలో పరిపాలన సజావుగా సాగకపోవడం. అవినీతి పనులకు వంత పాడాల్సిరావడం. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసేలా రాజకీయపరమైన ఒత్తిళ్లు వస్తుండటం. దీంతో నిజాయితీపరులైన, నిబంధనలను ఉల్లంఘించడానికి ఇష్టపడని, రాజకీయ నేతలకు వంతపాడలేని ఐఏఎస్‌ అధికారులు 'బాబు సర్కారులో పనిచేయడం మావల్ల కాదు' అనుకుంటూ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దుకుంటున్నట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అవినీతి రాష్ట్రం' అంటూ 'నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సిఎఇఆర్‌) కొంతకాలం క్రితం తెలియచేసింది. మంత్రులు అవినీతి పనులు చేస్తున్నారని బాబు కూడా సమావేశాల్లో హెచ్చరించారు. 

    ఆంధ్రా నుంచి వెళ్లిపోవడమే ధ్యేయం

    సరిగ్గా చెప్పాలంటే బాబు సర్కారులో పనిచేయడానికి ఇష్టపడని ఐఏఎస్‌ అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్రాలో పనిచేయడానికి ఇష్టపడని వారిలో అనేకమంది సీనియర్లున్నారు. నిజాయితీపరులైన అధికారుల బదిలీలు చేస్తూ మానసిక క్షోభ కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు ఐఏఎస్‌ అధికారులు మీడియాతో ఆఫ్‌ ది రికార్డుగా తమ బాధలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు పాలన అపసవ్యంగా ఉందని చెబుతున్నారు. ఆ పాలనలో తాము ఇమడలేకపోతున్నామంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.... ఆరుగురు సీనియర్‌ అధికారులు వెళ్లిపోయారు. మరో అధికారికి కేంద్ర సర్వీసు ఖరారైంది. ఆయన అంతా సర్దుకుంటున్నారు. వీరు కాక మరో పదిమంది వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ తరపున కీలక పాత్ర పోషించి, ఆ తరువాత రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి విశేష కృషి చేసిన అధికారికి తీవ్ర అవమానం జరిగింది. 'నిబంధనలకు విరుద్ధంగా వెళ్లను' అని తెగేసి చెప్పినందుకు అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. ప్రభుత్వం ఆయన నిర్ణయాలను కాదని సొంత నిర్ణయాలు తీసుకోవడంతో తీవ్రంగా అసంతృప్తి చెందిన ఆయన కేంద్ర సర్వీసుకు ప్రయత్నాలు చేసుకొని సఫలమయ్యారు. అమరావతి నిర్మాణానికి ఉద్దేశించిన స్విస్‌ఛాలెంజ్‌ విధానంలోని నిబంధనలను వ్యతిరేకించిన ఒక సీనియర్‌ అధికారిని బదిలీ చేయడంతో ఆగ్రహించిన ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిపై ఇస్తుండటాన్ని కూడా ఎక్కువమంది 

వ్యతిరేకిస్తున్నారు.  ఇలాంటి సమస్యలే కాకుండా ఐఏఎస్‌ అధికారులకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సరైన సౌకర్యాలు లేవు. తమ కార్యాలయాలు విశాలంగా లేవని, వాటిల్లో పనిచేయడం ఇబ్బందిగా ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. సచివాలయంలో ఉద్యోగులు అనేక బాధలు పడుతున్నారని గతంలో అనేక కథనాలొచ్చాయి. చంద్రబాబుకే తన ఛాంబర్‌ నచ్చలేదంటే దీన్ని ఎంత బాగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. మరి పక్కా వాస్తు ప్రకారం నిర్మించినా, ప్రసిద్ధ నిర్మాణ కంపెనీలు పనిచేసినా ఇలా ఎందుకైందో తెలియడంలేదు. పరిపాలన విషయంలో అసంతృప్తిగా ఉన్న అధికారులకు సచివాలయం కూడా చికాకు కలిగిస్తోంది.

    సొంత రాష్ట్రమైనా సుఖం లేదు

     ఐఏఎస్‌ అధికారుల్లో కొందరి సొంత రాష్ట్రం ఆంధ్రాయే అయినా అక్కడ పనిచేయడానికి ఇష్టపడటంలేదు. రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులకు  వారు తెలంగాణలో పనిచేయాలో, ఆంధ్రాలో పనిచేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించడంతో అనేకమంది ఆంధ్రా ఉద్యోగులు సొంత రాష్ట్రానికి పోతామని ఆప్షన్‌ పెట్టుకున్నారు. తెలంగాణలో పనిచేస్తే ఇక్కడి వారు 'ఆంధ్రోళ్లు' అనే పేరుతో కక్ష సాధిస్తారని, వేధిస్తారని భయపడ్డారు. మరో ప్రధాన కారణం హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదని నిశ్చింతగా ఉన్నారు.సాధ్యమైనంత త్వరగా హైదరాబాదు నుంచి బయటపడాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రా ఉద్యోగులకు గుబులు మొదలై  వెళ్లకుండా తప్పించుకునే మార్గాలు వెదికారు. వేధింపులు ఎదురైనా భరించి హైదరాబాదులోనే ఉండాలని అనుకున్నారు.  సొంత రాష్ట్రానికి పోవడం ప్రధానం కాదని, సౌకర్యంగా జీవించడమే ముఖ్యమన్నారు. అప్పట్లోనే పలువురు సివిల్‌ సర్వీసు అధికారులు తాము తెలంగాణలో పనిచేస్తామని లేదంటే డిప్యుటేషన్‌ మీద కేంద్రానికి వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. వాస్తవానికి ఆంధ్రాకు ఐఏఎస్‌ అధికారులు తక్కువగా ఉన్నారు. విభజన తరువాత ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు 211 మంది. కాని  ఈ ఏడాది మే నెల నాటికి 165 మందే ఉన్నారు. వీరిలోనూ పది మంది అప్పటికే కేంద్రానికి వెళ్లిపోయారు.అప్పటికీ ఇప్పటికీ అనేకమంది వెళ్లిపోయారు.  మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌లు లేని రాష్ట్రం అవుతుందేమోనని అనుమానంగా ఉంది. 

    చంద్రబాబు తినేస్తుండటమూ ఓ కారణమే

    బాబు అధికారులను, మంత్రులను తినేస్తున్నారు. అంటే వారి బుర్రలు తినేస్తున్నారని అర్థం. జంధ్యాల సినిమాల్లోని 'సుత్తి' కంటే ఈయన ఎక్కువ సుత్తి కొడుతున్నారని, జీవితం మీదనే విరక్తి పుడుతోందని అధికారులు, మంత్రులు, నాయకులు తలకాయలు పట్టుకుంటున్నారు. బాబుగారి సుత్తి గురించి 'సాక్షి' మాత్రమే కాక  'పచ్చ' పత్రిక ఆంధ్రజ్యోతి కూడా రాసింది.  బాబు మీటింగులంటే అందరూ గజగజ, గడగడ వణికిపోతున్నారు. మీటింగుకు వెళ్లాక శోషొచ్చి పడిపోతున్నారు. 'బాబును భరించడం చాలా కష్టం' అని అధికారులు, మంత్రులు, నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా చెప్పి ఘొల్లుమంటున్నారు. 'బాబోయ్‌ కాలింగ్‌' అంటూ ఆంధ్రజ్యోతి, 'బాబోయ్‌ బాబు మీటింగ్‌' అంటూ సాక్షి ప్రచురించిన కథనాలు బాబు ఎలా బుర్రలు మేస్తున్నారో వివరించాయి. బాబు మీటింగులు ఆంధ్రజ్యోతికే విసుగు తెప్పించాయంటే అవి ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాబు బుర్రలు మేస్తారనే కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తాము ఆంధ్రాకు వెళ్లేది లేదని మొండికేశారు. మీటింగుల భయంతోనే ప్రయత్నాలు చేసుకొని కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మీటింగులు గంటల తరబడి నిర్వహించడం, విపరీతంగా సుత్తి కొట్టడం బాబుకు మొదటినుంచి అలవాటే. చెప్పిందే చెబుతారు తప్ప ఒక్క కొత్త విషయమూ ఉండదు. కొంతకాలం క్రితం నిర్వహించిన  జిల్లా కలెక్టర్ల సమావేశం తలనొప్పి తెప్పించింది.  రెండో రోజు సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగిసింది. బాబు  మీటింగులకు శనివారం లేదు, ఆదివారం లేదు. సండే కూడా మీటింగుకు రమ్మని సీఎం ఆఫీసు నుంచి కబురొస్తుంది. మాకు కుటుంబాలు లేవా? పిల్లా పాపలు లేరా? ఇవేం మీటింగులంటూ అధికారులు జంధ్యాల సినిమాల్లో మాదిరిగా చొక్కాలు చింపుకుంటున్నారట...! పోనీ మీటింగుల్లో కొత్త విషయాలుంటాయా? ఉండవు. 'పాడిందే పాడరా' టైపు. అధికారులు వెళ్లిపోతుండటానికి ఇదీ ఒక కారణమే. అంటే ఒత్తిళ్లను భరించలేకపోతున్నారన్నమాట. 

 -మేడేపల్లి నాగేందర్‌

Show comments