హీరోయిన్ భావనని కిడ్నాప్ చేసి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సునీల్ ఎట్టకేలకు దొరికాడు. కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించిన అతన్ని పోలీసులు వ్యూహాత్మకంగా అరెస్ట్ చేసి, అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచారు. వారం రోజులుగా సునీల్ తప్పించుకు తిరుగుతోన్న విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ సినిమా షూటింగ్ ముగించుకుని, తిరిగి వెళుతున్న సమయంలో భావనని కిడ్నాప్ చేశారు దుండగులు. రెండున్నర గంటలపాటు కారులో ఆమెను లైంగికంగా వేధించారు. రెండున్నర గంటల అనంతరం ఆమెను కారులోంచి బయటకు తోసేసి, నిందితులు పారిపోయారు. ఈ ఘటనలో భావన వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యకి కూడా ఉండటంతో 'కిడ్నాప్' కేసులో నిందితులు పోలీసులకు తేలిగ్గానే చిక్కేశారు. అయితే, సునీల్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఓ సినీ ప్రముఖుడే ఆశ్రయం కల్పించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో నటిస్తోంది భావన.
భావన కిడ్నాప్ ఉదంతంతో మలయాళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. దేశమంతా అట్టుడికిపోయేలా చేసింది ఈ ఘటన. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులూ హీరోయిన్ భావనకి బాసటగా నిలిచారు. ప్రధాన నిందితుడు దొరికినా, అతని వెనుక ఇంకెవరైనా వున్నారా.? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే మారింది. భావన కిడ్నాప్ - లైంగిక వేధింపుల వెనుక పెద్ద 'సినీ కుట్ర' వుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.