అయ్యో పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!!

అమ్మ పురట్చితలైవి మరణించినప్పుడు కూడా పరిస్థితి ఇంత దారుణంగాలేదు. అప్పట్లో అర్జంటుగా తానే సీఎం అయిపోవాలని కలలు కన్న నెచ్చెలి శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరినీ రిసార్టుకు తీసుకువెళ్లి క్యాంపు నిర్వహించారు గుర్తుందా? ఆ క్యాంపులో కూడా ఎమ్మెల్యేల పరిస్థితి ఇంత ఘోరంగా లేదు. కనీసం ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ సందుచిక్కితే ప్రహరీగోడ దూకి పారిపోవడానికి చాలినంత స్వేచ్ఛ వారికి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతకంటె దుర్భరంగా బతుకుతున్నారు. ఇక్కడ కూడా ఏదో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం పడుతున్న పాట్లేమో అనుకుంటే పొరబాటు. కేవలం ఒకేఒక్క రాజ్యసభ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడానికి, ఈలోగా ఎమ్మెల్యేలు తమకు ఝలక్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా... జైలు జీవితంకంటె ఘోరంగా శిబిరంలో ఉంచేస్తున్నారు. 

అవును.. ఇదంతా గుజరాత్ ఎమ్మెల్యేల దుస్థితి. ప్రస్తుతం గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి, భాజపాకు జై కొట్టారు. మరింత మంది పార్టీని వీడే బాటలో ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. పైగా రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నికలు వచ్చాయి. సోనియాకు రాజకీయ సలహాదారు, వ్యక్తిగత కార్యదర్శి అయిన కీలక నాయకుడు అహ్మద్ పటేల్ ఇక్కడినుంచి బరిలోకి దిగారు. ఇక ఆయనకోసం పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. గుజరాత్ లో తమ పార్టీకంటూ మిగిలిన ఎమ్మెల్యేల ఓటును ఏమాత్రం కోల్పోకుండా.. చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఎమ్మెల్యేలందరినీ తీసుకువచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తున్న కర్ణాటకలో క్యాంపు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు నగర శివార్లలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్స్ లో అందరికీ వసతి కల్పించారు. 

కాకపోతే ఒక రకంగా ఇది నిర్బంధించడం లాగానే ఉన్నదని ఎమ్మెల్యేలు వాపోతున్నారుట. ఎందుకంటే.. వారినుంచి సెల్ ఫోన్లు కూడా లాగేసుకున్నారు. ఏదో టీవీల చానెల్స్ చూసుకోవడం మినహా వారికి మరో వ్యాపకం ఉండడంలేదు. ఒకవైపు గుజరాత్ ను ముంచెత్తుతున్న వరదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల చెంత లేకపోతే.. ఉన్న పరువు కూడా పోతుందని వారిలో చాలామంది భయపడుతున్నప్పటికీ పార్టీ పట్టించుకోవడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అక్కడ గుజరాత్ వరదల్లో మునిగిపోతూ ఉంటే.. తమ ఎమ్మెల్యేలకు విలాసాలు కల్పిస్తూ.. మడికెరె వంటి అందమైన ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తోంది. 

తమను దాదాపుగా అరెస్టు చేసినంత డ్రామా నడిపిస్తూ.. క్యాంపు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం పట్ల చాలామంది ఎమ్మెల్యేల్లో విముఖత వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో వరదల సమయంలో ఇలా తమను కట్టిపడేయడం వల్ల సోనియా కార్యదర్శి అహ్మద్ పటేల్ గెలుస్తారేమో గానీ.. మళ్లీ ఎన్నికల్లో తాము తిరిగి ప్రజల వద్దకు వెళ్లడానికి మొహం చెల్లదని, జనం తమను ఛీకొడతారని వారు భయపడుతున్నారు.  Readmore!

Show comments