కోట్ల రూపాయిలు భూంఫట్

172 ఎకరాలు. ఎకరా జస్ట్ మూడు లక్షల రూపాయిలు. విశాఖ జిల్లాలో ఏ మారుమూలకు వెళ్లినా ఎకరా పది లక్షల రూపాయిలకు లోపు దొరకదు. అలాంటిది విశాఖకు జస్ట్ యాభై కిలోమీటర్ల దూరంలో కేవలం మూడు లక్షల వంతున 172 ఎకరాలు. దీనివల్ల కల్పించే ఉద్యోగాల సంఖ్య జస్ట్ ఆరువేలు. కానీ ప్రభుత్వం కాకిలెక్క పరోక్ష ఉపాథి వేల మందికి అంటూ హడావుడి. 

నిన్నటికి నిన్న ప్రభుత్వం మెగా ఫుడ్ పార్క్ లు అంటూ పేరు పెట్టి, రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు వందలాది ఎకరాలు విశాఖ సమీపంలో కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఎంత డొల్లగా వుందో చూద్దాం. పరోక్షంగా నలభై వేల మందికి ఉపాథి అంట, పరోక్షంగా ఆరువేల మందికి ఉద్యోగాలు అంట. అందుకోసం ఏకంగా జస్ట్ మూడు లక్షలకే ఎకరా వంతున 172 ఎకరాలు ఇచ్చేసారు. అక్కడ నిజానికి ఎకరా ఇరవై లక్షల వరకు వుందని జనాల లెక్క. పోనీ పది లక్షలే అనుకున్నా, 172 ఎకరాలకు ఏడు లక్షల వంతున చూసుకున్నా 12 కోట్ల రూపాయలు పతంజలి సంస్థకు లాభం. 

ఇంతకీ పతంజలి సంస్థ ఏం చేస్తుందట..గిరిజనుల దగ్గర నుంచి పళ్లు, ఇతరత్రా  సరకులు కొని ప్రాసెస్ చేస్తుందట. కానీ అలా గిరిజన ప్రాంతం నుంచి కొనుగోలు చేయాలనుకున్నపుడు ఇదే ప్రదేశానికి మరో యాభై  కిలోమీటర్లు లోపలకికి వెళ్తే గిరిజన ప్రాంతం మరింత దగ్గరగా వస్తుంది కదా? అక్కడ తీసుకోవచ్చు కదా? దానివల్ల గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా? ఇప్పటికే అభివృద్ది చెందిన చోట ఫుడ్ పార్క్ ఎందుకు? 
ఇదిలా వుంచితే ఇప్పటికే గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ జిసిసి సంస్థ బ్రహ్మాండంగా గిరిజన ఉత్పత్తులు సేకరించి మార్కెట్ చేస్తోంది.

విశాఖ కేంద్రంగా వున్న జిసిసి గిరిజన ఉత్పత్తులకు బ్రహ్మాండమైన మార్కెట్ ను సాధించిపెట్టింది ఇప్పటికే. ఇప్పుడు పతంజలి రంగప్రవేశం చేస్తే, జిసిసి పని ఎలా వుంటుంది? అలాగే ఇప్పటికే ఢిల్లీ నుంచి వ్యాపారులు వచ్చి విజయనగరం జిల్లా నుంచి మామిడి, దాని ఉపఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. అలాంటపుడు ఇక్కడ పతంజలి సంస్థ ఏర్పాటు ఏ విధంగా రైతులకు లాభం? పోటీ వచ్చి ఎక్కువ రేటువస్తుంది అనుకుందాం. దాని కోసం వందలాది ఎకరాల భూమిని ఇంత కారుచౌకగా ఇవ్వాల్సిన అవసరం వుందా? ఇప్పుడు మరో కార్పొరేట్ సంస్థ కూడా ఇలా అడిగితే ఇస్తూ పోతారా? ఇంతకీ పతంజలి సంస్థ కల్పించే ఆ ఆరువేల ఉద్యోగాలు అయినా వాస్తవ రూపం దాల్చడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో? ఆలోగా ఈ భూముల రేట్లు ఎన్ని రెట్లు పెరుగుతాయో? 

Readmore!

Show comments