కేంద్రం వేసిన సీఎంల కమిటీ.. ఓ కుట్రేనా?

నల్లధనం కట్టడి చేసేస్తాం అని కబుర్లు చెబుతూ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి సామాన్యుడిని కష్టాలకు గురిచేస్తున్న మోదీ సర్కారు.. కొత్తగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జాతీయ స్థాయిలో ఓ కమిటీని నియమించింది. అయితే ప్రజల కష్టాలు - వాటిని దూరం చేయడం, లేదా నల్లధనం నియంత్రణలో ప్రజల ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకత స్వచ్ఛందంగా పెరిగేలాగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ కమిటీ ఏర్పాటు వల్ల గానీ.. ఈ కమిటీ సిఫారసుల వల్ల గానీ జరగకపోవచ్చు అనే అనుమానాలు కొందరిలో పొడసూపుతున్నాయి. మొదట అయిదుగురు ముఖ్యమంత్రులతో వేయదలచుకున్న కమిటీని, తర్వాత 13 మంది సభ్యులు ఉండేలా విస్తరించారు. వీరిలో గరిష్టంగా అధికారులు కూడా ఉన్నారు. అసలు ఈ విస్తరణే ఓ పెద్ద కుట్ర అని కొందరు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు సారథ్యంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేయడానికి తొలుత కేంద్రం సంకల్పించినట్లు, ఆ మేరకు చంద్రబాబును సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అందులో చంద్రబాబుతోపాటు శివరాజ్ సింగ్, నితీశ్ కుమార్, నారాయణస్వామి, మాణిక్ సర్కార్ లను ఇందులో నియమించారు. అయితే సారథ్యానికి చంద్రబాబు విముఖత చూపిన నేపథ్యంలో ఒక రోజు తర్వాత.. కమిటీ మళ్లీ పూర్తస్థాయిలో ప్రకటన వచ్చింది. ఇందులో 13 మంది సభ్యలు ఉన్నారు.

అయితే ముఖ్యమంత్రులు మాత్రమే కమిటీలో ఉన్నట్లయితే వారు చేసే సూచనలు కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉంటాయని, కేంద్ర ప్రభుత్వానికి నష్టం వస్తుందని.. ఆ నష్టాలు రాకుండా ఉండాలంటే కేవలం ముఖ్యమంత్రులే కాకుండా.. కమిటీలో అధికారుల్ని కూడా నియమించాలని కూర్పులో ఒక కుట్ర చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు. ఈ కమిటీ ప్రధానంగా నగదు రహిత లావాదేవీలు పెరగడానికి, ఆమేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎలాగ? కేంద్ర ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేదిశగా సూచనలు చేయాలి.

అయితే వివిధ రాష్ట్రాల  ముఖ్యమంత్రులు ఇప్పటికే పన్నుల విధానంలో మార్పు రావాలనే డిమాండ్ ను ప్రధానంగా వినిపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు సమస్తం పారదర్శకంగా ఆన్ లైన్ లో జరిగేలా ఉండాలంటే.. ఆదాయపు పన్నును రద్దుచేసి.. బ్యాంకు ఖాతాలో పడే ప్రతి క్రెడిట్ మీద నామమాత్రపు పన్ను విదించాలని దీనివలన కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం  ఆదాయపు పన్ను ద్వారా లభిస్తున్న దానికంటె చాలా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ముఖ్యమంత్రులు సూచిస్తున్నారు. అయితే అడ్డగోలుగా ప్రజల నడ్డి విరిచేలా వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును వదలుకోవడం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు.

అందుకే కేవలం ముఖ్యమంత్రులతో మాత్రం కమిటీని వేస్తే, వారంతా కలిసి ప్రస్తుత పన్నుల విధానాల్ని రద్దు చేసి, పూర్తిగా కొత్త పన్నుల పద్ధతిని సూచిస్తే.. తాము ఇరుకున పడతామని కేంద్రం భావించినట్లుంది. అందుకే అలాంటి కుట్రపూరిత ఆలోచనతోనే, కేంద్రం మనుసులోని మాటను గ్రహించి సూచనలు చేసే అధికారుల్ని కూడా ఇందులో భాగస్వాముల్ని చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. కేంద్రం ప్రజలంతా నగదు రహిత, కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయాలని కేంద్రం సంకల్పించడం గొప్ప నిర్ణయమే. కాకపోతే.. అందుకు ప్రస్తుతం మన దేశంలో అమల్లో ఉన్న అడ్డగోలు పన్నుల విధానం సమంజసమైనది కాదని కూడా వారు తెలుసుకోవాలి. 

Show comments