‘శశికళ’.. ఇప్పుడు తీసుకోండి సినిమా!

జయలలిత కథను ‘శశికళ’ పేరుతో సినిమా తీస్తానని ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటిస్తే.. చాలా మందికి అది అంతగా ఎక్కలేదు! జయలలిత అలాంటి ఐకాన్ బయోపిక్ ను ఆమె సన్నిహితురాలి పేరుతో సినిమా తీయడం ఏమిటి? ఎంత జయకు సన్నిహితురాలైతే మాత్రం.. ఆమె నేపథ్యం నుంచి సినిమా ఏమిటో.. అని అనుకున్నారు! మరి వర్మ ఏం ఆలోచించాడో కానీ, ఆయన అలా ప్రకటించిన తర్వాత శశికళ కథలో ఎన్నో మలుపులు. అనూహ్యమైన పరిణామాలు. ఊహకు అందని ట్విస్టులు.. ఆమె కథలో ఇదే చివరి సీన్ అనుకోవడానికి లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే అనూహ్యమైన మలుపుతో శశికళ జీవితం జైలు పాలయ్యేలా కనిపిస్తోంది!

మరి రాజకీయ ధిగ్గజం జయలలితతో పాటుగా, ఆమెకు నెచ్చెలిగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళ రాజకీయాల్లో కొనసాగిన శశికళ మరోసారి జైలుకు వెళుతోంది. ఇది వరకూ జైలుకు వెళ్లినా అప్పుడు ఆమెకు జయ వెంట ఉన్నారు, తోడుగా ఉన్నారు. అయితే ఇప్పుడు శశికి ‘అక్క’ లేదు! ‘అమ్మ’ లేదు! దీంతో.. ఈ సారి జైలుకు వెళ్లడంతో ఈమె చరిత్రలో కలిసిపోయేనట్టే అనుకోవాల్సి వస్తోంది!

మూడున్నరేళ్ల సంవత్సరం జైలు, పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.. ఈమె రాజకీయ జీవితం ముగియడానికి ఈ కాలం చాలు! జయ ఉన్నంత కాలమూ.. ఎలాంటి పదవినీ చేపట్టకుండా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ వచ్చిన శశి, చివర్లో ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోయి భంగపడింది. చివరి వరకూ దూకుడుగానే వ్యవహరించి జైలుకు వెళ్తోంది!

జయకు సన్నిహితురాలిగా శశి కళ ఏమిటో కానీ.. జయ మరణానంతరం శశికళ జీవితం మాత్రం సంచలన రీతిలో ఉంది. శిక్ష ఖరారు అయ్యే దశలో తన వెంట ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో కానీ, కేంద్రంతో ఢీ కొట్టడంలో కానీ.. శశి తెగువ గట్టిదే. అయితే కాలం కలిసి రాక.. ఈమె జైలుకు వెళ్లాల్సి వస్తోంది!

Readmore!

ఇప్పుడు శశిని దుర్మార్గురాలిగా అభివర్ణిస్తూ.. పన్నీరు గెలుస్తున్నాడు, ధర్మం గెలిచింది.. శశి సీఎం కాకపోవడం న్యాయం విజయం సాధించిందని.. కొంతమంది అంటున్నారు. ఇప్పుడు శశికళ మాత్రమే కాదు, ది గ్రేట్ లేట్ జయలలిత కూడా దోషిగా నిర్ధారణ అయినట్టే. ఆమె పేరు చెప్పుకునే ఇప్పుడు పన్నీరు రాజకీయం.. మరి పన్నీరు శ్రేష్టుడా?

Show comments