జగన్‌ వ్యతిరేక శిబిరానికి షాక్‌.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి పెద్ద ఊరట.. అదే సమయంలో ఆయన వ్యతిరేక శిబిరానికి దిమ్మ తిరిగే షాక్‌.! అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌, ప్రస్తుతం బెయిల్‌ మీద వున్న విషయం విదితమే. ఆ బెయిల్‌ని రద్దు చేయాలని ఇటీవలే సీబీఐ, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూ సాక్షి ఛానల్‌లో ప్రసారం కావడాన్ని ప్రశ్నిస్తూ, సీబీఐ - న్యాయస్థానంలో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని కోరిన విషయం విదితమే. 

అయితే, ఆ ఇంటర్వ్యూకీ తనకూ ఎలాంటి సంబంధం లేదని జగన్‌ న్యాయస్థానంలో కౌంటర్‌ దాఖలు చేశారు. జగన్‌ తరఫు లాయర్లు, న్యాయస్థానంలో గట్టిగానే వాదనలు విన్పించారు. సాక్షి ఎడిటోరియల్‌ బోర్డ్‌ తీసుకునే నిర్ణయాలకీ జగన్‌కీ సంబంధమేంటని ప్రశ్నించారు. జగన్‌ తరఫు లాయర్ల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా సాక్షుల్ని జగన్‌ ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనను కొట్టి పారేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌ తిరస్కరణకు గురికావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, ఈ పిటిషన్‌ నిలబడదని తాము ముందే ఊహించామని జగన్‌కి మద్దతుగా న్యాయస్థానం వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇక, 'జడ్జిమెంట్‌ డే'.. నేటితో జగన్‌ రాజకీయ జీవితానికి తెర.. అయోమయంలో వైఎస్సార్సీపీ.. ఇలా గత కొద్ది రోజులుగా 'బెయిల్‌ రద్దు పిటిషన్‌' నేపథ్యంలో కథనాల్ని వండి వడ్డించేశాయి జగన్‌ వ్యతిరేక శిబిరానికి చెందిన మీడియా సంస్థలు. ఒకవేళ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా, పై కోర్టును ఆశ్రయించేందుకు జగన్‌కి అవకాశం వుంటుందన్న కనీస పరిజ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేకపోయాయి. 

మొత్తమ్మీద, బెయిల్‌ రద్దు పిటిషన్‌ తిరస్కరణ అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తే, అదే సమయంలో జగన్‌ వ్యతిరేక శిబిరం తీవ్ర నిరాశకు గురయ్యిందనే చెప్పాలి.

Show comments