సూపర్‌ స్టార్‌ 'ఉచిత' సలహా

ఓ సినిమాపై అంచనాలు క్రియేట్‌ అవడం ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. ఓ స్టార్‌ హీరోపై అంచనాలు పెరగడమంటే ఇంకా ఇంకా చిన్న విషయం. ప్రముఖ హీరోతో సినిమా అనగానే, పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసి తమ 'ప్రోడక్ట్‌'ని అనూహ్యమైన రేట్లకు అమ్మేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడాల్లేవిక్కడ. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఈ వికృత పోకడ చాలా విరివిగా చూస్తున్నాం. 

'బ్రహ్మూెత్సవం' సినిమా ఎందుకు డిజాస్టర్‌గా నిలిచింది.? 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఎందుకు బొక్క బోర్లా పడ్డాడు.? ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలే కన్పిస్తాయి తెలుగులో. తమిళ సినీ పరిశ్రమలోనూ అంతే. రజనీకాంత్‌నే తీసుకుంటే, 'కొచాడియాన్‌', 'లింగా', 'కబాలి' సినిమాలు కనీ వినీ ఎరుగని దారుణ పరాజయాల్ని చవిచూశాయి. 

ఇక్కడ నిర్మాతల తప్పు ఎంత.? హీరోల తప్పు ఎంత.? అన్న డిస్కషన్‌ మొదలు పెడితే, తప్పు అందరిలోనూ కన్పిస్తుంది, దర్శకుడితో సహా. కాంబినేషన్‌ వుంటే చాలు, కథ అవసరం లేదనే నిర్లక్ష్యం, సినిమా ఎలా వచ్చినాసరే హైప్‌ క్రియేట్‌ అయ్యింది గనుక, ఆ హైప్‌ని క్యాష్‌ చేసేసుకుందామనుకోవడం.. ఇలాంటి చర్యలు ఓ మోస్తరు సినిమాని కూడా డిజాస్టర్‌గా మార్చేస్తున్నాయి. అందరి టార్గెట్‌ 100 కోట్ల పైనే. ఓ పది కోట్లతో సినిమా తీద్దాం, ఇరవై కోట్లు సంపాదిద్దాం.. అన్న ఆలోచనల్లేవు. పాతిక కోట్లతో తీసినాసరే, 100 కోట్లు కొల్లగొట్టేయాలన్న ఆలోచనే. అక్కడే తేడా కొట్టేస్తోంది. పోనీ, కంటెంట్‌ గురించి ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారా.? అంటే అదీ లేదు. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'చావు కబురు' చల్లగా చెప్పాడు. నిర్మాతలు అత్యాశకు పోయి, భారీ మొత్తాలకి సినిమాల్ని అమ్ముకోకూడదట. అదే అన్ని అనర్ధాలకీ కారణమని సెలవిచ్చాడాయన. దాంతో, మొత్తంగా సినిమా - అంచనాలు - డిజాస్టర్లు అన్న అంశంపై చర్చ షురూ అయ్యింది. హంతుకుడే నీతులు చెబితే ఇలాగే వుంటుందంటూ, 'కబాలి', 'లింగా', 'కొచాడియాన్‌' సినిమాల్ని చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అవును మరి, అంచనాలు పెరుగుతోంటే పండగ చేసుకున్న రజనీకాంత్‌, అమ్మకాల విషయంలో నిర్మాతని ఎందుకు వారించలేకపోయారట.? తన సినిమాలు వరుసగా ఫ్లాపవుతోంటే తానెందుకు ఆలోచించలేదట.? 

ఉచిత సలహానే కదా ఇచ్చేద్దాం.. అనుకుంటే, నెటిజన్లు ఊరుకోవట్లేదు ఇదివరకటిలా.! కడిగి పారేస్తున్నారంతే.

Show comments