ఉద్ధరించవయ్యా రజనీకాంతూ..

'మమ్మల్ని ఉద్ధరించడానికే నువ్వు భూమ్మీద పుట్టావు.. మా తల రాతలు మార్చే శక్తి నీకు మాత్రమే వుంది.. తమిళనాడు అంతా నీ కోసం ఎదురుచూస్తోంది.. రా, రాజకీయాల్లోకి వచ్చెయ్‌.. రాజకీయ పార్టీ పెట్టెయ్‌.. అధికార పీఠం నీకే దక్కుతుంది..'' 

- మేటర్‌ అదిరిపోయింది కదూ.! రజనీకాంత్‌ ఎక్కడ.? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు రాజకీయాల్లో. 'రాజకీయాల పట్ల ఆసక్తి లేదు..' అని చెప్పిన నోటితోనే, 'అధికారం భలే కిక్‌ ఇస్తుంది తెలుసా.?' అంటారాయన. 'రాజకీయాల గురించి మాట్లాడేద్దాం.. వచ్చెయ్యండి..' అని అభిమానుల్ని పిలుస్తారు, ఊస్సూరుమనిపించేస్తారు.. దటీజ్‌ రజనీకాంత్‌. 

ఏం చేసినాసరే, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 'కొచాడియాన్‌' సినిమా డిజాస్టర్‌.. అయినా, 'లింగా' సినిమాకి అంచనాలు ఆకాశాన్నంటేశాయి. 'లింగా' డిజాస్టర్‌.. అయినా 'కబాలి'పై అంచనాలు మారలేదు. 'కబాలి' బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది.. మళ్ళీ అంతకు మించిన అంచనాలు 'రోబో 2.0'పైన క్రియేట్‌ అవుతున్నాయి. ఎన్ని ఫ్లాప్‌ సినిమాలు రజనీకాంత్‌ నుంచి వచ్చినా, ఆయనకున్న ఫాలోయింగ్‌ తగ్గదు.. రాజకీయాల పేరు చెప్పి ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తున్నా, ఆయన్ని రాజకీయాల్లోకి రమ్మనేవారి సంఖ్య పెరుగుతోందేగానీ తగ్గడంలేదు. 

కొత్తగా తమిళనాడులో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి.. ఆయన్ని రాజకీయాల్లోకి రమ్మని కోరుతూ. ఇంకోపక్క రజనీకాంత్‌కి రాష్ట్రపతి పదవి ఇస్తారట, రజనీకాంత్‌కి కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటున్నారట.. ఇలా గాసిప్స్‌ గుప్పుమంటూనే వున్నాయి. ఈ గాసిప్స్‌ని, రజనీకాంత్‌ ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. వీటిని నమ్ముతోన్న అభిమానులే పాపం, వెర్రి వెంగళప్పలైపోతున్నారు.

Show comments