శశికళ గేమ్ అయిపోలేదు.. మళ్లీ మొదలైంది!

అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పళనిస్వామి. జయ, పన్నీరుల కేబినెట్ లో మంత్రిగా ఉండిన పళనిస్వామిని ఏఐఏడీఎంకేఎల్పీ అధ్యక్షుడిగా చేసినట్టుగా శశికళ వర్గం ప్రకటించేసింది! అక్రమాస్తుల కేసులో శశికి శిక్ష ఖరారు అయిన నేపథ్యంలో ఆమె వర్గం నుంచి ఈ ప్రకటన వచ్చింది. పళని స్వామిని అధ్యక్షుడిగా ఎన్నుకొంటూ మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయని.. ఆయన చేత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించాలని ఈ వర్గం గవర్నర్ ను కోరుతోంది!

ఇది శశికళ ఆఖరి ప్రయత్నం అనుకోవాల్సి వస్తోంది. ఇది అందరూ ఊహించినదే అని చెప్పాలి. తను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో శశి తన వాళ్లలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని అనుకున్నారంతా. ఇప్పుడు అదే జరుగుతోంది. పళనిస్వామిని బరిలోకి దించి శశి తన రెండో ప్లాన్ ను అమల్లో పెడుతోంది. కింద పడ్డా పై చేయి తనదే ఉండాలన్నట్టుగా ఆమె వ్యవహరిస్తోంది.

అయితే ప్రయత్నంలో ఆమె ఎంత వరకూ విజయంతం అవుతుంది? అనేది ప్రశ్నార్థకమే! ఎందుకంటే.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, జైలుకు తీసుకెళ్లే అవకాశాలు దండిగా ఉన్నాయి. అధికారం ఎలాగూ పన్నీరు చేతిలో నే ఉంది. కాబట్టి.. ఈ అదునులో ఎమ్మెల్యేలను ఆయన ప్రలోభపెట్టవచ్చు, లేక శశికళ నుంచి విముక్తి పొందామని కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీరు వైపు వెళ్లిపోవచ్చు! 

అలాగే ఒక్కసారి జైలుకి వెళితే శశికళకు అన్ని తలుపులూ బంద్ కావొచ్చు! అలాంటి నేపథ్యంలో పన్నీరు రంగంలోకి దిగి పళని స్వామి లాంటి వాళ్లనే తనవైపుకు తిప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో గవర్నర్, కేంద్రంల అండ పన్నీరుకే ఉందని వేరే చెప్పనక్కర్లేదు. 

ఏదేమైనా.. శశికళ గేమ్ క్లోజ్ అనుకుంటే.. ఆమె మరో ఎత్తు వేసింది. ఈ ఎత్తు చిత్తవుతుందా? లేక పన్నీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిలబడి.. గేమ్ ను నడిపిస్తారా? వేచి చూడాలి! 

Show comments