'పప్పు' తప్పు కాకపోతే అరెస్టులెందుకు.?

పైకి చెప్పేది ఒకటి, తెరవెనుకాల జరిగేది ఇంకొకటి. 'పప్పు' అంటూ 'చినబాబు' నారా లోకేష్‌పై సోషల్‌ మీడియా విరుచుకుపడ్తోంటే, ఈ 'పప్పు ప్రవాహాన్ని' అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్‌, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. పైకి చెప్పే కారణం వేరు, అసలు కారణం వేరు.. చట్ట సభల్ని కించపర్చేలా వ్యవహరించారంటూ అరెస్టుల పర్వానికి తెరలేపినా, సోషల్‌ మీడియాకి అడ్డుకట్ట వేయడమైతే సాధ్యం కాలేదు. 

ఏం చేసినా, సోషల్‌ మీడియాని అడ్డుకోలేమని 'టీడీపీ'కి తెలిసొచ్చినట్టుంది. అందుకే, చినబాబు కూడా సర్దుకుపోయారు. 'పప్పు అనుకోండి.. ఉప్పు అనుకోండి.. డోన్ట్‌ కేర్‌..' అంటూ తాపీగా సెలవిచ్చారు నారా లోకేష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో. అంతకు మించి, ఆయన ఇంకేం చేయగలరు.? రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు.. ఏం, టీడీపీ నేతలు వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు చేయడంలేదా.? వైఎస్‌ జగన్‌ కుటుంబంపై దుమ్మెత్తి పోయడంలేదా.? సేమ్‌ టు సేమ్‌ అదే రివర్స్‌ గేర్‌లో టీడీపీ మీద జరుగుతోందంతే.! 

'ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. డోన్ట్‌ కేర్‌..' అంటూ నారా లోకేష్‌ నిజంగానే తన మనసులో మాట చెప్పి వుంటే, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు సర్కార్‌ 'సాహసం' చేసి వుండదు. పైగా, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపాలనే ఆలోచన కూడా నారా లోకేష్‌దేనాయె.! ఆయన మీద సోషల్‌ మీడియాలో వెటకారాలు జోరందుకున్నాకే అరెస్టుల పర్వం షురూ అయ్యింది. 

ఎలాగైతేనేం, నారా లోకేష్‌కి తత్వం బోధపడినట్లుంది. రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు. విమర్శలెందుకు.? అంటే, తమని తాము సరిదిద్దుకోవడం కోసం. అలాగని వ్యక్తిగత దూషణని ఎవరూ సమర్థించరు. కానీ, అలాంటి దూషణలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డవాడే నిజమైన నాయకుడు.

Show comments