వారసత్వం.. రాజకీయం.!

'నాన్నా నేనే గెలిచాను.. నన్ను ఆశీర్వదించు..' 

- ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌కి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన తర్వాత ఆయన్ని ఉద్దేశించి చేసిన ప్రకటన. 

'మేనత్త జయలలిత ఆశయ సాధన కోసం పనిచేస్తాను.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలంతా నా నాయకత్వాన్నే కోరుకుంటున్నారు.. నేనే జయలలితకు నిజమైన వారసురాల్ని..' 

- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప నేడు, ఎంజీఆర్‌ సమాధి వద్ద, అలాగే తన మేనత్త జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం చేసిన వ్యాఖ్యల సారాంశం. 

అటు ఉత్తరభారతదేశం, ఇటు దక్షిణ భారతదేశంలో రెండు అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వయానా ములాయంసింగ్‌ యాదవ్‌ పొలిటికల్‌ డ్రామాకి తెరలేపారనీ, తనయుడి బలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఇంత హైడ్రామా నడిపిస్తున్నారనే ప్రచారం సంగతెలా వున్నా, సమాజ్‌వాదీ పార్టీపై అఖిలేష్‌ యాదవ్‌ పట్టు నిలుపుకున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, ఆ పట్టులో 'బిగువు' ఎంతో తెలియాలంటే, ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడవ్వాల్సిందే. 

ఇక, దీప పరిస్థితి వేరు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ ఏం చెబితే అదే జరుగుతోందిప్పుడు. పార్టీ అధినేత్రి పదవి కావాలనుకున్నారు, సాధించేశారు. రేపో మాపో ముఖ్యమంత్రి పీఠమెక్కడానికీ శశికళ సమాయత్తమైపోయారు కూడా. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు తనవెంటే వున్నారని దీప చెప్పడమంటే, రాజకీయంగా ఆమె తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే అందరికీ కన్పిస్తోంది. 

శశికళ వ్యతిరేకులంతా దీప వైపుకు మొగ్గు చూపుతున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, ఇంతవరకు ఓ మంత్రిగానీ, ఓ ఎమ్మెల్యేగానీ దీపకి మద్దతు పలకలేదు. దాంతో, దీప ఇప్పుడు ఏం చేసినా, రాజకీయ వ్యూహాలు ఎంతలా రచించినా.. అవన్నీ శశికళ ముందు 'కుప్పిగంతులు'గానే మారిపోతాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తమిళనాడులో శశికళ పవర్‌ సెంటర్‌ ఇప్పుడు. ఆమెను కాదని దీప చేయగలిగేదేమీ లేదు. 

అయితే, శశికళను విమర్శించొద్దు.. అంటూ తన మద్దతుదారులకు ముందే సంకేతాలు పంపడం ద్వారా, దీప కూడా పొలిటికల్‌ స్కెచ్‌ గట్టిగా వేసినట్లు కన్పిస్తోంది. రాజకీయాల్లో విమర్శలు చేయకపోతే ఎలా.? అయినాసరే, ముందుగా బలం చాటుకోవాలి.. ఆ తర్వాతే, శశికళతో పోటీ పడాలనే విషయమ్మీద దీప కాస్త క్లారిటీతోనే వుందని భావించొచ్చు. దీప ఎన్ని వ్యూహాలు పన్నినా, శశికళ వ్యూహాల ముందు చిత్తయిపోవాల్సిందేనని అన్నాడీఎంకేలో మెసార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకేనేమో దీప వెంట వారెవరూ వెళ్ళేందుకు ఇష్టపడటంలేదు. 

మొత్తమ్మీద, దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాల్లో రాజకీయం 'యువత' చుట్టూ తిరుగుతోందన్నమాట. అక్కడ అఖిలేష్‌.. ఆల్రెడీ ప్రూవ్‌ చేసేసుకున్నాడు. ఇక్కడ దీప, ఇంకా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటోంది. భవిష్యత్‌ తమిళ రాజకీయం ఎలా వుండబోతోందోగానీ, దేశం దృష్టిని అయితే దీప ఆకర్షించేయగలిగిందన్నది నిర్వివాదాంశం.

Show comments