భారీ రామాయణం శుద్ద దండగ

అయిదువందల కోట్లతో రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటన వచ్చేసింది. ఎంత మార్కెటింగ్ వ్యూహాలు వున్నా, ఎంత హడావుడి చేసినా, ఇది మాత్రం వృధా ప్రాజెక్టు అవుతుందనడం గ్యారంటీ. కేవలం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లతో స్కేల్ పెంచగలరేమో కానీ, కథలో ఉత్కంఠ తేలేరు. కొత్తదనం ఆపాదించలేరు. ఆ మధ్య బాపు లాంటి దిగ్దర్శకుడే వీలయినంత భారీ సెట్లు వేసి, ఇళయరాజాతో మంచి పాటలు చేయించినా కూడా నిర్మాత గట్టెక్కలేకపోయారు. దీనికి కారణం సినిమా కథ జనాలకు ఏ మాత్రం కొత్తది కాకపోవడం అన్నదే కీలకం తప్ప, రామాయణం తీయకూడదని కాదు.

అయితే ఒకలా అయితే మాత్రం సినిమా కాస్త ఆసక్తి కలిగే అవకాశం వుంది. కేవలం యుద్ధకాండను మాత్రం తీయడం. ఎందుకంటే రామ రావణ యుద్ధం అన్నది ఒక్క యుద్దం కాదు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు ఈ ముగ్గురు చేసిన యుద్దాలు మూడు కీలక ఘట్టాలు. సుందరకాండ నుంచి యుద్ధకాండ వరకు ఓ భాగంగా తీయగలిగితే, ఆ భారీ స్కేల్ కాస్త ఆసక్తి కలిగించే అవకాశం వుంది. కానీ అది కూడా తక్కువే.

మహాభారతం, రామాయణం టీవీ సీరియళ్లు ఆదిలో ఆదరణ పొందినంతగా తరువాత తరువాత పొందలేదు. ఎంత స్కేల్ పెంచినా కూడా. ఇప్పుడు రామాయణంపై అయిదు వందల కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవడం అంటే, కేవలం స్కేల్ చూసి, బాహుబలిని చూస్తున్నారని అపోహ పడడమే. కేవలం స్కేల్ ఒక్కటే కాదు, యూనివర్సల్ అప్పీల్ వున్న జానపద కథ కావడం, కొత్త పాత్రలు, వాటికి తగిన నటులు, ఇలాంటివి చాలా వున్నాయి.

పైగా పురాణాల వరకు వచ్చేసరికి మన ప్రేక్షకులు అందరు నార్త్ నటులను ఆ పాత్రల్లో చూడలేరు. సౌత్ ఫేస్ లకు దగ్గరగా వున్నవారిని మాత్రమే మనవాళ్లు పౌరాణిక పాత్రల్లో చూడగలరు. చెక్కపేడుల్లా, ఫేస్ ల్లో ఫ్యాట్ లేని చాలా మొహాలు నార్త్ పౌరాణిక సినిమాల్లో, సీరియళ్లలో కనిపిస్తాయి. వాటిని మనవాళ్లు ఏక్సెప్ట్ చేయలేరు. అలా అని మన నటులను వాళ్లు ఏక్సెప్ట్ చేయరు. ఇలాంటి సమస్యల పౌరాణిక సినిమాలకు చాలా వున్నాయి.

అందువల్ల బాహుబలి వెయ్యి కోట్లు చూసిందనో, జనాలు అలాంటి స్కేల్ భారీగా వున్న సినిమాలను చూస్తున్నారనో ఇలాంటి ప్రాజెక్టులు తలకెత్తుకోవడం అవివేకమే అవుతుందని విడుదల తరువాత తెలుస్తుంది.

Show comments