ఈయన వైకాపాలో ఉన్నట్టా ? లేనట్టా..?

మిగతా వాళ్లే నయం.. ఒక్కసారి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ల తలనొప్పి పోయింది. ప్యాకేజీలు కుదరడంతో వాళ్లు ఎంచక్కా తెలుగుదేశంలో చేరిపోయారు. ఆ తర్వాత వాళ్ల కష్టాలేవో వాళ్లు పడుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సవాళ్లు విసురుతూ జోకర్ల లెక్కన నవ్వుల పాలు అవుతున్నారు. నైతికంగా , చట్టపరంగా రాజీనామా చేయాల్సిన వాళ్లు...తమ పదవులకు రాజీనామా చేయకుండా జగన్ కు సవాళ్లు విసురుతూ కామెడీ చేస్తున్నారు.

వాళ్ల సంగతలా ఉంటే... గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం తెలుగుదేశంతో తీవ్రమైన సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇతడు వైకాపాలో ఉన్నట్లో లేనట్లో అర్థం కాని పరిస్థితి. ఉదయం లేస్తేఈయన తెలుగుదేశం నేతలతో సాన్నిహిత్యంగా కనిపిస్తూ ఉంటాడు. తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు  ఏ కార్యక్రమానికి హాజరైనా వారితో పాటు ఈ  వైకాపా ఎమ్మెల్యే కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈయన మరెవరో కాదు ముస్తఫా. వైకాపా ఎమ్మెల్యే అయిన ఈయన గత కొంతకాలంగా తెలుగుదేశం నేతలతో చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నాడు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ పార్టీకి ముస్తఫా హాజరయ్యాడు. ఈపార్టీకి జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాషాలు ముఖ్య అతిధులు! చంద్రబాబు కూడా హాజరైన ఈ ఇఫ్తార్ విందులో వీళ్ల హడావుడే ఎక్కువ. వీరికి తోడు ముస్తఫా కూడా హల్ చల్ చేశాడు. ఈ మధ్య విజయవాడలో జరిగిన వైకాపా సమావేశానికి ముస్తఫా హాజరు కాలేదని పచ్చమీడియా కాసేపు హడావుడి చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నాడు. 

దీంతో ఈయన వైకాపాలో ఉన్నాడా? లేక తెలుగుదేశంలో చేరిపోయాడా?అనేది అంత ఈజీగా అర్థమయ్యే విషయంలా కనపడటం లేదు. ఈ విషయం గురించి ముస్తఫానే అడిగితే..ప్రస్తుతానికి తాను వైకాపాలోనే ఉన్నానని.. ముందుకు ఏం జరగవచ్చునో తను ఏం చెప్పలేమని అంటున్నాడు. బహుశా ఈయన గురించి ఈయనకే క్లారిటీ లేదు కాబోలు!

Show comments