మెగా హీరోయిన్‌.. మళ్ళీ సస్పెన్స్‌.!

చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా కోసం కాజల్‌ అగర్వాల్‌ని హీరోయిన్ గా ఫిక్స్‌ చేయాల్సి వచ్చింది. అప్పటికి వరుసగా రెండు బీభత్సమైన ఫ్లాపులతో (బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్) వున్న కాజల్‌, ఎలాగైతేనేం 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో హిట్టు కొట్టేసిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక ఇప్పుడు మళ్ళీ చిరంజీవి కొత్త సినిమాకి హీరోయిన్‌ సమస్య వచ్చిపడింది. ప్రస్తుతానికైతే చిరంజీవి కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేదానిపై క్లారిటీ లేకపోయినా, సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా సినిమా అయితే కన్‌ఫామ్‌ అయ్యింది. రామ్‌చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాత. 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' అనే స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథే ఈ సినిమా అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా నిర్మాత రామ్‌చరణ్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. 

సినిమా అంటూ ప్రారంభమయ్యాక హీరోయిన్‌ని వెతుక్కోవచ్చులే.. అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, 'ఖైదీ' సినిమా కోసం హీరోయిన్‌ వెతుకులాట ఎంత కష్టమయ్యిందో నిర్మాతగా చరణ్‌కి బాగా తెలుసు. అందుకే, ముందే హీరోయిన్‌ వేటలో పడ్డారట. అనుష్క నుంచి మొదలు పెట్టి పలువురు హీరోయన్లను ఇప్పటికే పరిగణనలోకి తీసుకుంటున్నారట. కాస్త చిరంజీవికి సూటయ్యేలా వుండే కొందరు యంగ్‌ హీరోయిన్లనూ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అనుష్క, చిరంజీవితో 'స్టాలిన్‌' సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌లో కన్పించిన విషయం విదితమే. 

ఇదిలా వుంటే, త్రిష, నయనతార, అంజలి తదితరుల పేర్లనీ పరిశీలిస్తున్నారట చిరంజీవి కొత్త సినిమా కోసం. వీళ్ళంతా ’ఖైదీ‘ కోసం కూడా లెక్కల్లోకి వచ్చనివారేననుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, త్వరలోనే, హీరోయిన్‌ విషయంలో మెగా ప్రొడ్యూసర్‌ రామ్‌చరణ్‌ తేజ ఓ క్లారిటీ ఇవ్వనున్న దరిమిలా, ఆ హీరోయిన్ ఎవరవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

Show comments