తప్పదు.. రోడ్డెక్కాల్సిందేనేమో.!

తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జయలలిత మరణం తర్వాత.. మరీ ముఖ్యంగా, గడచిన వారం పది రోజుల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడ్తుందా.? లేదా.? అన్నదానిపై తమిళనాడు ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అన్నాడీఎంకే పార్టీలో శశికళ వర్గంగా చెప్పబడ్తున్న ఎమ్మెల్యేల సంఖ్యపై నేడు క్లారిటీ రానుంది. శశికళ దాచి వుంచిన శిబిరంలోని ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని తీసుకున్న అధికారులు, ఆ వివరాల్ని న్యాయస్థానం ముందుంచనున్నారు కాస్సేపట్లో. తద్వారా, శశికళ వర్గం ఎమ్మెల్యేలపై ఇప్పటిదాకా విన్పిస్తున్న ఊహాగానాలు నిజమా.? కాదా.? అనేది తేలిపోతుంది. 

తన వద్ద 8 మంది ఎమ్మెల్యేలు వున్నారనీ, ఎంపీలు 12 మంది వున్నారనీ పన్నీర్‌ సెల్వం చెబుతున్నారు. చెప్పడమే కాదు, వాళ్ళంతా పన్నీర్‌ సెల్వంతోపాటుగా కన్పిస్తున్నారు. పన్నీర్‌ సెల్వంతో పోల్చితే శశికళ వద్ద వున్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య చాలా చాలా ఎక్కువ. అయినాసరే, ముఖ్యమంత్రి పీఠమెక్కాలంటే శశికళ తన బలాన్ని నిరూపించుకోవాలి.. ఆమె చెబుతున్న 129 మంది ఎమ్మెల్యేలూ ఆమె దగ్గరే వున్నారన్న విషయంపై క్లారిటీ రావాలి. కానీ, ఆ పరిస్థితులే కన్పించడంలేదు. ఎందుకంటే, ఆమె అంచనాలకు మించి పన్నీర్‌ సెల్వం బలం పుంజుకుంటున్నారు మరి. 

ఇదిలా వుంటే, వారం రోజులు దాటుతున్నా, ముఖ్యమంత్రిగా తన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి లైన్‌ క్లియర్‌ చెయ్యని గవర్నర్‌ తీరుకి నిరసనగా నేడు శశికళ, జయలలిత సమాధి వద్ద దీక్ష చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చెన్నయ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకోపక్క, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌ సెల్వం, నేడు సచివాలయానికి వెళ్ళి, సమీక్షలు జరపనున్నారు. 

ఈ పరిస్థితుల్లో శశికళ ముందున్న ఆప్షన్‌ ఒక్కటే.. బల ప్రదర్శనకు దిగడం. 'దీక్ష' చేపడితే తప్ప, పొలిటికల్‌గా తన ఇమేజ్‌ పెరిగే అవకాశాలు కన్పించడంలేదని శశికళ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే చెప్పారట అయితే, ఈ దీక్ష వల్ల ఉపయోగమెంత.? ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే, దాన్ని పన్నీర్‌ సెల్వం తనకు అడ్వాంటేజ్‌గా మార్చుకుంటారేమోనన్న ఆందోళన కూడా ఆమెను వెంటాడుతోంది. 

మొత్తమ్మీద, నేడు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి సంబంధించినంతవరకు కొంత క్లారిటీ అయితే రావొచ్చు. ఆ క్లారిటీ ఎమ్మెల్యే లెక్క వరకే పరిమితమవుతుందా.? ముఖ్యమంత్ర ఎవరన్నదానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందా.? వేచి చూడాల్సిందే. 

Show comments