సంక్షేమానికి కట్టుబడిన చంద్రబాబు

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, పేదవర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను అమలుచేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉప ముఖ్యమంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొని, చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుచేస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ఏ వర్గం ఆర్ధికంగా వెనుకబడి ఉంటే, అటువంటి వారిని గుర్తించి సముచిత రీతిలో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యంగా కృషి జరుగుతోందన్నారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గానికి ఇచ్చిన హామీకి ముఖ్యమంత్రి నూరుశాతం కట్టుబడి ఉన్నారన్నారు. కాపులను బీసీలలో చేర్చే విషయంలో వెనుకాడేది లేదని, మంజునాథ కమీషన్‌ నివేదిక అందిన అనంతరం కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

ఇప్పటికే కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకుంటోందని పేర్కొన్నారు. గత మూడేళ్ళ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమయ్యిందని, రానున్న రోజుల్లో ఇంకా నవ్యాంధ్ర సాధన దిశగా కృషి జరుగుతోందని తెలిపారు.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు కేవలం తన కార్యదీక్ష, పట్టుదలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తున్నారని చినరాజప్ప పేర్కొన్నారు.

Show comments