టాలీవుఢ్ పై కోలీవుడ్ కన్ను

ఇటీవలి కాలంలో తమిళ సినిమాలు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఏవరేజ్ అయిపోతున్నాయి. చిన్న సినిమాల సోసో గా వుంటున్నాయి. దీంతో తమిళ నిర్మాతలు, డైరక్టర్ల కన్ను తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. ఇప్పటికే తమిళ డైరక్టర్లు తెలుగు ప్రాజెక్టులు పట్టుకోవడంలో బిజీగా వున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేస్తున్న, చేయబోతున్న మురుగదాస్, విక్రమ్ కుమార్, లింగుస్వామి, కేఎస్ రవికుమార్. వీళ్లంతా తమిళ డైరక్టర్లే. వీళ్లు కాక అన్నపూర్ణ బ్యానర్ లో ఓ తమిళ కొత్త దర్శకురాలు రాజ్ తరుణ్ తో సినిమా చేస్తున్నారు. 

దర్శకుల సంగతి అలా వుంచితే ఇప్పుడు పలువురు తమిళ నిర్మాతలు కూడా తెలుగు సినిమాల నిర్మించే ఆలోచనల్లో వున్నారట. ముఖ్యంగా తెలుగు హీరోలతో బై లింగ్యువల్ సినిమాలు తీసే ఆలోచనలు చేస్తున్నారట. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలు, తీసే ఆలోచనలు సాగుతున్నాయి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా కాస్త వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల పది కోట్లలో సినిమా తీస్తే రెండు లాంగ్వేజ్ ల్లో గిట్టుబాటు అయిపోతుందని ప్రాజెక్టు డిస్కషన్లు సాగుతున్నాయి. థాను లాంటి నిర్మాతలు తెలుగు ప్రాజెక్టు చేసే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మీడియం సినిమాకు రెండు కోట్ల  వరకు కనీసం శాటిలైట్ వుంటుంది. రెండు భాషలు కలిపి శాటిలైట్, హిందీ శాటిలైట్ హక్కులు అన్నీ కలిసి సగం ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేస్తుంది. అందువల్ల తెలుగు ప్రాజెక్టులు చేయడం పై ఆసక్తి కనబరుస్తున్నారట తమిళ నిర్మాతలు. ఇప్పటికే కొందరు నిర్మాతలు రాజ్ తరుణ్ ను సంప్రదించారు. మరి కొందరు నిఖిల్ ను కూడా సంప్రదించారట. 

మొత్తానికి మన సినిమాలకు మార్కెట్ విస్తృతం అవుతోంది.

Show comments