వర్మ పొలిటికల్‌ పంచ్‌.. భలే పేలుతోంది.!

జయలలిత మరణానంతరం ఓ సినిమా తీస్తానంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో సోషల్‌ మీడియాలో వెల్లడించిన విషయం విదితమే. జయలలిత - శశికళ మధ్య అనుబంధం సహా అనేక అంశాలు ఈ సినిమాలో చూపిస్తానని అప్పట్లో వర్మ ప్రకటించాడు. ఇంతకీ, ఆ సినిమా ఏమయ్యింది.? అనడక్కండి.. అది వేరే విషయం.! 

ఇక, తాజాగా వర్మ సోషల్‌ మీడియా ద్వారా తమిళనాడు రాజకీయాలపై పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ పంచ్‌ పేల్చారు. ఈసారి పంచ్‌ పేలింది ప్రధాని నరేంద్రమోడీ మీద కావడం గమనార్హం. జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని పన్నీర్‌ సెల్వం నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, నరేంద్రమోడీ భూతవైద్యుడవుతారా.? అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు రామ్‌గోపాల్‌ వర్మ. 

'జయలలిత ఆత్మ, పన్నీర్‌సెల్వంతో మాట్లాడిందట.. నరేంద్రమోడీ ఇప్పుడు భూతవైద్యుడిలా మారతారా.?' అంటూ వర్మ చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా.. జయలలిత మరణానంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరవెనుక సూత్రధారి ప్రధాని నరేంద్రమోడీయేనన్నది నిర్వివాదాంశం.

మొత్తమ్మీద ఇలాంటి సంఘటనల్ని బేస్ చేసుకుని సినిమాలు ప్రకటించడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ, భూతం - భూత వైద్యుడు.. అంటూ ఓ సినిమా అనౌన్స్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Show comments