ఈ రెడ్డి గార్ల ఐక్యత ఎన్ని రోజులో!

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో.. 2009 కి ముందు కాంగ్రెస్ లో… నెల్లూరు జిల్లా తర్వాత ఎక్కువ గ్రూపులున్నది నల్లగొండ జిల్లాలోనే. అంతర్గత ప్రజాస్వామ్యం దండిగా ఉండిన కాంగ్రెస్  పార్టీలో .. గ్రూపురాజకీయాల గురించి కొత్త గా వివరించేదేమీ లేదు. ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ రెండు మూడు గ్రూపులుగా విడిపోయి ఉండేది. ఇలాంటి గ్రూపు రాజకీయాల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతిభ  మరీ ఎక్కువగా కనిపించేది. నెల్లూరు వంటి జిల్లాలో పది నియోజకవర్గాలుంటే.. పది వర్గాలుండేవి. గ్రూపులు కట్టడంలో కూడా ఒకరు లీడర్ గా మరొకరు అనుచరుడిగా చలామణి అయ్యేదేం ఉండేది కాదక్కడ. ఎవరి గ్రూపు వారిది.. వారి గ్రూపుకు వాళ్లే లీడర్.

ఇలాంటి వాతావరణమే నల్ల గొండ జిల్లా కాంగ్రెస్ లోనూ ఉంటూ వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ జాడే లేదు కాబట్టి, నెల్లూరు కథ వదిలేస్తే.. నల్ల గొండ కాంగ్రెస్ లో గ్రూపుల గొడవ కొనసాగుతూనే ఉంది. కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, పాల్వాయి.. ఇలా ఎవరి గ్రూపు వారిది. ఎవరి రాజకీయం వారిది. పార్టీ అధినాయకత్వం వీరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే.. మిగిలిన వాళ్లు బహిరంగంగానే వారిని ఎద్దేవా చేయడం రొటీన్ సీరియల్.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ ని, సీఎల్పీ లీడర్ జానాను ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంతగా కించపరుస్తూ వచ్చాడో వేరే వివరించనక్కర్లేదు. అలాగే.. కోమటిరెడ్డి సోదరులపై పాల్వాయి విరుచుకుపడుతూ వచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డేమో వెంకట్ రెడ్డికి పీసీసీ నుంచి నోటీసులు ఇప్పించాడు. దీనికి ప్రతిగా జానా, ఉత్తమ్ లపై కోమటిరెడ్డి బ్రదర్స్ అధిష్టానానికి ఫిర్యాదులు చేసి, వారిని ఆ పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ ను బహిరంగంగానే చేస్తున్నారు.

మరి ఇలా కొనసాగుతున్న రచ్చకు పుల్ స్టాప్ పడిందని అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ అభిమానులు. ఈ ఆదివారం నల్ల గొండ వేదికగా జరిగిన పార్టీ మీటింగులో కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు హాజరు కావడం.. అంతా కలిసి కేసీఆర్ పై విరుచుకుపడటం.. ఐక్యతకు చిహ్నం అంటున్నారు కాంగ్రెస్ ఫ్యాన్స్. అనునిత్యం కలహించుకునే వీళ్లు ఒకే వేదికను పంచుకోవడం, ఆ వేదికపై ఒకరిని ఒకరు దూషించుకోకపోవడం ఆసక్తికరమైన విషయమే మరి! ఇలాంటి మీటింగుల్లో ఒకరినొకరు నిందించుకున్న చరిత్ర ఉంది వీళ్లకు. అయితే.. ఇప్పుడు మాత్రం అంతా కలిసి కట్టుగా కనిపించారు. కానీ.. ఈ ఐక్యత ఎన్ని రోజులు? అనేది మాత్రం ప్రశ్నార్థకమే! Readmore!

Show comments

Related Stories :