కేసులు ఇలా కూడా విచారిస్తారా?

ముద్రగడ కనుక బేషరతుగా దీక్ష విరమిస్తే, తుని విధ్వంస కేసులు మరోసారి విచారించే వీలు వుందట. ముఖ్యమంత్రి, కాపు మంత్రులు సమావేశంలో తేలిన విషయం ఇది. అంటే ఏమనుకోవాలి? ఈ దేశంలో చట్టాలు, దర్యాప్తు సంస్థల పట్ల ప్రజలకు అసలే అంతంత మాత్రం విశ్వాసం వుంది. ఇక అది కూడా పూర్తిగా సడలిపోతుందన్నమాట. 

ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు, పెట్టిన కేసులు చేసిన అరెస్టులు ఏమనుకోవాలి. అవి సరిగ్గా లేవని అనుకోవాలా? ఇప్పుడు మరోసారి దర్యాప్తు చేస్తే, అరెస్టయిన వారు నిర్దోషులు అని తేలితే..? దర్యాప్తు చేసిన సంఘాలది, చేసిన వ్యక్తులది తప్పు అని అంగీకరిస్తారా? అప్పుడు వారిపై కోర్టులో ఎవరైనా తప్పుడు కేసులు, తప్పుడు దర్యాప్తు అని కేసు పెడితే జవాబు దారీ ఎవరు?  మన దేశంలో ఎవరికీ అంత సీన్ లేదని ధీమానా?

మంత్రులు మరో అడుగు ముందుకు వెళ్లి, రైల్వే కేసులు కనుక, కేంద్రంతో మాట్లాడాలి అంటున్నారు. అంటే సిఫార్సు వుంటే కేసులు గాలికి వదిలేస్తారా? బనాయించడం వీరి ఇష్టం..ఎత్తేయడం వీరి ఇష్టం. మరి ఇలా అయితే మరోసారి విధ్వంసానికి పాల్పడకుండా ఎందకు వుంటారు? ధీమా వుంటుందిగా..తమనాయకులు చూసుకుంటారు. తమకు మంది బలం వుంది.. తాము కేసులు ఎత్తేయించుకోగలం అని? కేసులు, దర్యాప్తులవిషయంలో ఇలా రెండు ధోరణులతో ఆలోచించేవారు మన నాయకులు.. మన పాలకులు.. మన మంత్రులు... ఇదీ మన ప్రజాస్వామ్యం.

Show comments