తలా తోకా లేని సుజనా వాదన!

ఒక వైపు హైకోర్టు విభజన అనే అంశం బాగా వేడి పుంజుకుంటోంది. ఈ సమయంలో హైకోర్టు విభజన అనేది అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకులు తలొక రీతిగా మాట్లాడడం అనేది కొత్తగా అనేక సందేహాలకు తావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికిచెందిన అనేక మంది న్యాయాధికారులను ఇంచుమించుగా ప్లాంట్‌ చేయడం ద్వారా.. తెదేపా.. ఒక కుట్రకు వ్యూహం రచిస్తున్నదనే తెరాస నాయకుల రాజకీయ ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే... తెలుగుదేశానికిచెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి చేస్తున్న వాదన మరొక ఎత్తు. 

హైకోర్టు విభజన కంటె ముందుగా కేంద్రం దృష్టి సారించి ఏపీభవన్‌ వంటివాటిని విభజించాల్సిన అవసరం ఉన్నదని సుజనా చౌదరి అంటున్నారు. ఏపీ భవన్‌ వంటి ఆస్తులను విభజించడం, హైకోర్టు విభజన కంటె తక్షణ అవసరంగా ఈ మంత్రిగారికి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ రకమైన సుజనా వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాయి. హైకోర్టు విభజన అనేది తెలంగాణకు మాత్రమే అనుకూలంగా ఉండే వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. దాని వలన న్యాయవ్యవస్థలో పనులు వేగవంతం కావడం అనేదే వాస్తవమైన ఫలితం అయితే గనుక.. రెండు రాష్ట్రాలకు సమానంగా ఆ ప్రయోజనం ఉంటుంది. విభజనను ఆపడం ద్వారా ఇతర ప్రయోజనాలు ఆశిస్తేచెప్పలేము. 

అయితే సుజనా చౌదరి మాటల్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఒక మౌలికమైన విషయాన్ని గమనించాలి. ఏపీ భవన్‌ విభజన అనేది ఆస్తుల పంపకం మాత్రమే. ఇందులో ఒకింత ముందు వెనకా జరిగినా పెద్దగా కొంపలు అంటుకుపోయేది ఏమీ ఉండదు. కానీ హైకోర్టు విభజన అనేది ఆస్తులపంపకం వంటిది కాదు. అది వ్యవస్థను విభజించడం. పైగా ప్రభుత్వానికి మూలస్తంభాలైన 'త్రీ ఎస్టేట్స్‌' రాజకీయం- అధికార వ్యవస్థ- న్యాయవ్యవస్థ... అనుకుంటే గనుక.. రాష్ట్రం రెండు ముక్కలు అయినప్పుడు.. రాజకీయ - అధికార వ్యవస్థలు రెండుగా విడిపోయిన తర్వాత కూడా కీలకమైన మూడో మూలస్తంభం వంటి న్యాయవ్యవస్థను విభజించకుండా ఉంచడం కరెక్టు కాదు. అయితే సుజనా చౌదరి దీనిని కూడా సింపుల్‌గా ఏపీ భవన్‌ పంపకంతో పోల్చేస్తున్నారు. 
చంద్రబాబు కూడా హైకోర్టు ప్రస్తావన తెచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్‌ అయిపోతున్నారు. ''రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది'' అంటూ రెండేళ్లుగా పాచిపోయిన పాటనే పాడుతున్నారు. ఆగమేఘాల మీద సచివాలయాన్ని బురదభవనాల్లోకి తీసుకువెళ్లిపోయిన చంద్రబాబు, అదే పౌరుషంతో తమ రాష్ట్రానికి సొంతమైన హైకోర్టును ఎందుకు కోరుకోవడం లేదో.. అర్థం కాని సంగతి. ఇది సుప్రీం కోర్టులో ఉన్న సంగతి అనడం కూడా దాటవేతే! 

వ్యవస్థలో విభజన అనేది ఎడ్మినిస్ట్రేషన్‌లో మార్పుచేర్పులకు దారి తీసేది. దీనిని సుజనా ఆస్తుల విభజనతో పోల్చకుండా ఉంటే ఆయన స్థాయికి సబబుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదైనా వక్రప్రయోజనాల్ని ఆశించి హైకోర్టు విభజనకు అడ్డుపడడం లేదని జనం నమ్మాలంటే ఆ నేతలు ఇలాంటి మాటలు మానుకోవాలి. 

Show comments