వైకాపా ఫిరాయింపు దారులకు మీడియేటర్‌ ఈయనే?

వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎంవీ మైసూరారెడ్డి గట్టి షాక్‌నే ఇచ్చాడా? ఇది వరకూ జరిగిన పలు ఫిరాయింపులకు మైసూరారెడ్డి మధ్యవర్తిత్వం చేశాడా? వైకాపాలో చివరి ఆరు నెలలూ పెద్దగా క్రియాశీలకంగా కనిపించని మైసూరారెడ్డి లోలోపల మాత్రం చాలా వ్యవహారాలనే చక్కబెట్టాడా? అంటే ఔను అంటున్నాయి వైకాపా వర్గాలు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలుగుదేశం వైపు జంప్‌ అయిన పలువురు వైకాపా ఎమ్మెల్యేల విషయంలో మైసూరారెడ్డి మధ్యవర్తిత్వం ఉందని వీరు చెబుతున్నారు. ఈ విషయంపై జగన్‌కు మొదట్లోనే తెలిసిందని కూడా చెబుతుండటం విశేషం.

వైకాపా నుంచి తనకు రాజ్యసభ సీటు దాదాపు దక్కదని అర్థమయ్యాకా మైసూరారెడ్డి తెలుగుదేశం పార్టీకి టచ్‌లోకి వచ్చాడని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో డైరెక్టుగా తెలుగుదేశం నేతలు తల పెట్టకుండా మైసూరారెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు చాలానే ఉపయోగపడ్డాడని సమాచారం. అప్పటికే తెలంగాణలో ఎమ్మెల్యేను కొనబోయి తెలుగుదేశం పార్టీ చాలా నష్టాన్నే చేసుకుంది. ఆ ఒక్క దెబ్బకు తెలంగాణలో తెలుగుదేశానికి సమాధి కట్టాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో గనుక సంప్రదింపుల సమయంలో అలాంటి లొల్లి జరిగి ఉంటే.. తెలుగుదేశం చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చేది. అలాంటి సమస్య ఏదీ లేకుండా.. మైసూరా రెడ్డి మొత్తం వ్యవహారం చాలా సాఫీగా జరిగిపొయ్యేలా చేశాడని, వైకాపాలో సైలెంట్‌గా ఉంటూ.. రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ఫిరాయింపు దారుల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించాడని సమాచారం.

సిమెంటు ఫ్యాక్టరీతో మైసూరాకు చాలా లబ్ధి చేకూరుతోందని, కేవలం తెలుగుదేశంలోకి చేరినంత మాత్రానికే ఇంతలాభం కలగదని.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మధ్యవర్తిత్వానికే ఇంత ప్రతిఫలం దక్కిందని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments