చంద్రబాబూ.. తాళమేసుకోవచ్చా.?

ఈసారి పక్కా.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే జరుగుతాయి.. 

- ఇదీ అధికార పార్టీ నేతల తాజా ప్రకటన. 

ఓ స్త్రీ రేపురా.. అప్పు రేపు.. మళ్ళడుగు.. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. రెండున్నరేళ్లుగా ఒకటే తంతు. ఓ సారి అయితే విశాఖపట్నంలో అన్నారు, ఇంకోసారి గుంటూరులో అన్నారు, మరోసారి తిరుపతిలో అన్నారు.. తాత్కాలికంగా షెడ్లు వేసి అయినాసరే అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలని చెప్పారు. ఏదీ జరగలేదు. 

అయితే, గతంలోలా కాకుండా, ఈసారి కాస్త నమ్మదగ్గేవిధంగానే వుంది అధికార పార్టీ నేతల ప్రకటన తదుపరి అసెంబ్లీ సమావేశాల విషయంలో. ఎందుకంటే, తదుపరి అసెంబ్లీ సమావేశాలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని అసెంబ్లీ, శాసనమండలి భవనాలు సిద్ధమైపోవచ్చుగాక. కానీ, దానికి చాలా చిత్తశుద్ధి కావాలి. 

ఎందుకంటే, తాత్కాలిక సచివాలయాన్ని జూన్‌ 2 నాటికి రెడీ చేస్తామన్నారు.. జూన్‌ పాయె, జులై పాయె, ఆగస్ట్‌ పాయె, సెప్టెంబర్‌లోకి వచ్చేశాం. అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది పరిస్థితి. ప్రారంభోత్సవాల మీద ప్రారంభోత్సవాలు జరిగాయి.. కానీ పూర్తిస్థాయిలో ఇంకా సచివాలయంలోని కార్యాలయాలే అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి అయితే అసెంబ్లీకి ఇంకా ఓ రూపు రాని పరిస్థితి. 

పరిస్థితిని ముందే అంచనా వేయడం మానేసి, ఇదిగో పులి.. అదిగో తోక.. అంటూ కథలు చెబుతుండడంతో సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయి. అదే సమయంలో, తెలంగాణ దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ పలచనైపోతోంది. 'మీరెళ్ళిపోండి..' అని తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కి అసెంబ్లీ విషయంలో అల్టిమేటం జారీ చెయ్యలేదు కదా, మరెందుకు ఈ ప్రకటనల తొందర. వీలైనంత త్వరగా అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్‌కి వెళితే మంచిదే. 

కానీ, ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లు చేస్తున్న ఈ ప్రకటనలే చేటు తెస్తున్నాయి. కాదంటారా.?

Show comments