నష్టాలొచ్చిన సినిమాను రీమేక్ చేయడమా..!

విక్టరీ వెంకటేష్‌కు రీమేక్‌లు అంటే చాలా ఇష్టం అని వేరే చెప్పనక్కర్లేదు. వెంకీ తన కెరీర్‌లో ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో సగానికి సగం రీమేక్‌లే! తమిళ, మలయాళ, హిందీ భాషల్లో హిట్ అయిన వివిధ సినిమాలను వెంకీ రీమేక్ చేశాడు. స్ర్టైట్ సినిమాలకు సమానమైన స్థాయిలో రీమేక్‌లను చేసిన తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ మాత్రమే. కెరీర్ ఆరంభం నుంచి ఇలాగే కొనసాగుతున్న వెంకీ ఇప్పటికీ ఏం మారలేదు.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ‘సలాఖుద్దూస్’ను రీమేక్ చేస్తున్నట్టుగా వెంకీ ధ్రువీకరించడం. మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను వెంకీ తెలుగులో రీమేక్ చేస్తాడని చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులూ వాటికి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్తలను సురేష్ బాబు ధ్రువీకరించాడు. వైజాగ్‌ను వేదికగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తామని ప్రకటించారు.

ఇక్కడ విశేషమైన అంశం ఏమిటంటే.. మాధవన్ సినిమా ప్రయోగాత్మకమైనదే అయినా, అది కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. దీనికి హిందీలో నష్టాలే మిగిలాయి. మంచి సినిమాగా ప్రశంసలు మాత్రమే దక్కించుకుంది కానీ, ఆర్థికంగా లాభాలను చూడలేదు ఈ సినిమా అని ట్రేడ్ పండితులు పేర్కొంటారు. అయినా కూడా దీని రీమేక్ పట్ల వెంకీ ఉత్సాహం చూపడం విశేషమే కదా. హిట్టైన సినిమాలు రీమేక్ చేసినప్పుడే వెంకీకి కొన్ని చేదు అనుభవాలు మిగిలాయి. అలాంటిది కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా, ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే.. ఈ సినిమాపై ఆయన ఎంత మోజు పెంచుకున్నాడో అర్థం అవుతుంది!

Show comments