జూన్ బాక్సాఫీస్ రివ్యూ

స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయిపోయాయి. బడా సినిమాలు కొన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో జూన్ మాసంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. గట్టిగా ఒక్క సినిమా కూడా ఆడని పరిస్థితి.

జూన్ మొదటి వారంలో 3 స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అంధగాడు మాత్రమే ఆకట్టుకోగలిగాడు. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అంధగాడుతో పాటు వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇక జూన్ రెండో వారంలో సోలోగా విడుదలైంది అమీతుమీ. గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ ఆఖరి నిమిషంలో వాయిదా పడడంతో అమీతుమీకి చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దొరికాయి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా వెన్నెల కిషోర్ కామెడీతో 2 వారాలు బాగానే నెట్టుకొచ్చింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.

జూన్ నెల మూడో శుక్రవారం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకొచ్చాయి. ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిన సినిమా మాత్రం ఒక్కటీ లేదు. ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ నటించిన మరకతమణి సినిమా కొందరు బాగుందన్నారు. కానీ అది పెద్దగా ఆడలేదు. అవంతిక, రాజా మీరు కేక, పెళ్లికి ముందు ప్రేమకథ, కాదలి సినిమాలు డిజాస్టర్లు అనిపించుకున్నాయి.

జూన్ లో పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది దువ్వాడ జగన్నథమ్ మాత్రమే. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైంది. మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అయిందని మేకర్స్ చెబుతున్నారు.

కాదు అట్టర్ ఫ్లాప్ అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. వారం రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అంటున్నారు. 50 కోట్లు కూడా వచ్చి ఉండవని కొందరు ఖండిస్తున్నారు. వసూళ్లు ఎలా ఉన్నప్పటికీ.. డీజే మాత్రం సూపర్ హిట్ కాదు.

ఇక జూన్ నెల ఆఖరి శుక్రవారం 3 స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హీరోగా నటించిన జయదేవ్ సినిమా ఉంది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కాగా.. జయదేవ్ తో వచ్చిన వైరస్, ఖయ్యుం భాయ్ సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.

Show comments