బాబు 'సై సై'.. చినబాబు 'నై నై'.!

దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరగాలనీ, పార్లమెంటు - అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాల్సిందేననీ కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఉవ్విళ్ళూరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిదీ ఇదే ఆలోచన.! 

నిజానికి ఆంధ్రప్రదేశ్‌కిగానీ, తెలంగాణకిగానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం చేస్తున్న 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' అనే నినాదంతో వచ్చే నష్టమేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి, చంద్రబాబు 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' నినాదానికి మద్దతు పలకడం సమంజసమే. కానీ, చినబాబు.. అదేనండీ, చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్‌కి మాత్రం, 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' అనే నినాదం అస్సలేమాత్రం నచ్చడంలేదు. ఆయనకేం కష్టం కనిపించిందో ఏమో ఇందులో.! 

తమిళనాడు అభ్యంతరం చెబితే అర్థం చేసుకోవచ్చు, బీహార్‌ నుంచి అభ్యంతరాలు వస్తే ఆలోచించొచ్చు... కానీ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రి అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యకరమే. పైగా, ముఖ్యమంత్రి 'సైసై' అన్నాక, మంత్రిగారు 'నైనై' అనడం విచిత్రమే. అందునా, సదరు ముఖ్యమంత్రిగారి పుత్రరత్నమే ఈ మంత్రిగారు కాబట్టి ఇక్కడా చినబాబుగారి అవగాహనా రాహిత్యం గురించి గట్టిగా చెప్పుకోవాల్సిందేనేమో.! 

ఏడాది ముందు ఎన్నికలు.. అంటే ఏ రాష్ట్రం మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది.? అన్నది నారా లోకేష్‌ వాదన. బహుశా, 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' అనే ప్రక్రియ, వచ్చే ఏడాదిలోనే జరుగుతుందని బహుశా నారా లోకేష్‌కి ప్రత్యేకంగా సంకేతాలు అంది వుండొచ్చు. అలాగైతే, మంత్రిగా ఓ ఏడాది పదవీ కాలం పోతుందన్నది ఆయన భయమేమో.! ఆగండాగండీ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీదే విజయమంటున్నారు నారా లోకేష్‌. అంతేనా, కథ చాలా వుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బాధ్యత తీసుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించేశారాయన. కామెడీకి పరాకాష్ట ఇది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో బాధ్యత తీసుకునే కదా, పార్టీని నట్టేట్లో ముంచేసింది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ స్థాయిలో పార్టీని పతాళానికి తొక్కేయాలని లోకేష్‌ ఉవ్విళ్ళూరుతున్నారేమో.! 

మొత్తమ్మీద, చినబాబు నారా లోకేష్‌.. ఆఖరికి చంద్రబాబుకి కూడా అర్థమయ్యేలా కన్పించడంలేదు. 'నేనేమో ఒకే దేశం - ఒకే ఎన్నికలంటే సైసై అనేశాను.. నా పుత్రరత్నమేమో అదేం కుదరదంటున్నారు.. ఇదెక్కడి తలనొప్పి.?' అని చంద్రబాబు, అర్జంటుగా అమృతాంజన్‌ పట్టించేసుకోవాల్సిందే ఇప్పుడు.

Show comments