ఆ రెండు పత్రికలు...!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఒకదానితో మరొకటి ఎలా పోటీ పడుతున్నాయో, అంతకు మించి పత్రికలు పోటీ పడుతున్నాయి. పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటుంటే, పత్రికలు అంత డైరెక్టుగా కాకపోయినా దాదాపు అలాగే వ్యవహరిస్తున్నాయి. పార్టీల్లో కొన్నింటికి ప్రత్యక్షంగా పత్రికలు (టీవీ ఛానెల్స్‌ కూడా) ఉండగా, కొన్నింటికి కొన్ని పత్రికలు మద్దతు ఇస్తున్నాయి. కంటెంట్‌ రూపంలో సహకరిస్తున్నాయి. ఇలాంటి పత్రికలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ వాటి వైఖరి చూస్తే అర్థమైపోతుంది. 

ఇలా మద్దతు ఇవ్వడానికి కారణం ఆయా పత్రికల్లో సంబంధిత పార్టీలు లేదా నాయకులు పెట్టుబడులు పెట్టడం, ఇతరత్రా ఆర్థిక సహాయం అందించడం కారణం కావొచ్చు. ఈ విషయం ఆ పత్రికలు అంగీకరించవు. నిరూపించేందుకు ఆధారాలూ ఉండవు. మొత్తంమీద పలు కారణాలతో పత్రికలు పార్టీలకు సహకరిస్తున్నాయి. ఇతర పత్రికల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు ఒకదానితో మరొకటి తీవ్రంగా పోటీ పడుతున్నాయి.  ఈ పోటీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో శృతి మించింది.  అంటే చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ విషయంలో అని అర్థం. ఆంధ్రజ్యోతి టీడీపీకి అనుకూలం. అందులో వార్తలు, కథనాలు చంద్రబాబును సమర్ధించేవిగా ఉంటాయి. 

సాక్షి చంద్రబాబుకు పూర్తిగా వ్యతిరేకం. ఇది అందరికీ తెలిసిందే. ఒకే సంఘటన లేదా ఒకే పరిణామంపై ఈ రెండు పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంటున్నాయి. వార్తా కథనాలు (న్యూస్‌ స్టోరీస్‌) పత్రికలు స్వతంత్రంగా రాసుకునేవి కాబట్టి తప్పనిసరిగా వైరుధ్యం ఉంటుంది. కాని ఈ రెండు పత్రికల్లో స్పాట్‌ వార్తలు (విలేకరుల సమావేశాలు, సంఘటనలు మొదలైనవి) కూడా పొంతన లేకుండా ఉన్నాయి. చంద్రబాబు విలేకరుల సమావేశం పెడితే ఆ వార్త రెండు పత్రికల్లోనూ ప్రచురితమవుతుంది. కాని పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చంద్రబాబే రెండు రకాలుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి వార్త కరెక్టా? సాక్షి వార్త సరైనదా? తేల్చుకోవడం కష్టం.  

ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే...రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెసు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బిల్లు ప్రవేశపెట్టి పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా వాతావరణం వేడెక్కింది. రాజ్యసభలో చర్చ తరువాత కేంద్రంపై చంద్రబాబు దూకుడు పెంచినట్లుగా ఆంధ్రజ్యోతిలో రాస్తుంటే, ఆయన మోదీతో సర్దుకుపోతున్నారని సాక్షి రాస్తోంది. ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెబుతున్నట్లు ఆంధ్రజ్యోతి రాస్తుండగా, ఎన్‌డీఏలోనే కొనసాగుతామని బాబు అంటున్నట్లుగా సాక్షి రాస్తోంది. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ రెండు పత్రికలు భిన్నంగా రాస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. 

ఆంధ్రజ్యోతి చదివేవారికి చంద్రబాబు కేంద్రంతో పోరాటానికి సిద్ధమయ్యారని, తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారనిపిస్తుంది. సాక్షి చదివేవారికి చంద్రబాబు కేంద్రంతో సర్దుకుపోతున్నారని, ప్రత్యేక హోదాపై ఏమాత్రం పట్టించుకోవడంలేదనిపిస్తుంది.అంటే ఆంధ్రజ్యోతి చంద్రబాబును హీరోను చేస్తుండగా, సాక్షి విలన్‌ ముద్ర వేస్తోంది.  ఇలా రెండు పత్రికలు వాటి సొంత అజెండాలతో ప్రజల మైండ్‌సెట్‌ను 'సెట్‌' చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మీడియా సొంత అజెండా (పార్టీల తరపున) కారణంగా ప్రజలకు నిజానిజాలు తెలియడం కష్టంగా ఉంది. ఎవరికివారు తాము నికార్సుగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కాని స్పాట్‌ వార్తలు కూడా తమ అజెండాకు అనుగుణంగానే రాసుకోవడాన్ని ఏమనాలి? విలేకరుల సమావేశాలను కూడా ట్యాంపర్‌ చేస్తున్నారు. 

జర్నలిజం సూత్రాల ప్రకారం వార్త వేరు, వ్యాఖ్య వేరు. పత్రికలు తమ అజెండా లేదా విధానాల ప్రకారం అభిప్రాయాలు చెప్పడానికి సంపాదకీయాలున్నాయి. కాని ఇప్పుడు ఏవి సంపాదకీయాలో, ఏవి వార్తా కథనాలో అర్థం కాకుండా ఉంది. చివరకు పత్రికల పోటీలో ప్రజలు (పాఠకులు) బలిపశువులవుతున్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'ఆ రెండు పత్రికలు' అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని విమర్శించేవారు. ఆ రెండు పత్రికల కారణంగానే సాక్షి పుట్టుకువచ్చింది. వైఎస్సార్‌ పోయాక కూడా ఆ రెండు పత్రికలు మిగిలేవున్నాయి. అవి సాక్షి, ఆంధ్రజ్యోతి. 

Show comments