చంద్రబాబుకి కేటీఆర్‌ పంచ్‌ పడింది.!

టీడీపీ అధినేత చంద్రబాబుకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సూపర్‌ పంచ్‌ వేసేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పరిపాలన ప్రారంభించడం చాలా ఆనందంగా వుందంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీటేస్తే, 'సంతోషం.. సచివాలయాన్ని నిర్మించుకున్నట్లే హైకోర్టు కూడా నిర్మించుకుంటే బావుంటుంది కదా..' అంటూ ఆ ట్వీట్‌కి రెస్పాన్స్‌ ఇస్తూ మస్త్‌ మస్త్‌ పంచ్‌ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. 

ఇది చంద్రబాబుకి వేసిన పంచ్‌ మాత్రమే కాదు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కి కేటీఆర్‌ వేసిన పంచ్‌గా భావించాలి. ఇందులో ఆయన చంద్రబాబుని వెటకారం చేశారనడం కన్నా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి.. బాధ్యత తెలిసేలా సూచన చేశారనుకోవడం మంచిదేమో.! ఎందుకంటే, పరిపాలన అంతా హైద్రాబాద్‌కి తరలిపోయాక, హైకోర్టు విషయంలోనూ చంద్రబాబు 'కీలకమైన ముందడుగు' వేయాల్సి వుంటుంది. 

కానీ, చంద్రబాబు రూటే సెపరేటు. హైకోర్టు విభజన అనేది కేంద్రం చేతుల్లో కూడా లేదని తేల్చేశారాయన. కేంద్రం కాకపోతే, హైకోర్టును విభజించేవారెవరు.? విభజన చట్టంలో హైకోర్టు విషయమై స్పష్టంగా పేర్కొన్నారు. ఆ స్పష్టత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నిర్మాణం జరిగేదాకా, హైద్రాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని. 

సో, ఇక్కడ మేటర్‌ క్లియర్‌. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు నిర్మాణాన్ని చేపడితే, ఉమ్మడి హైకోర్టు కాస్తా తెలంగాణ హైకోర్టు అయిపోతుంది. అప్పుడిక హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో కేసులున్నా.. ఇరు రాష్ట్రాల అంగీకారంతో, ఆ కేసులు కొట్టివేయబడటానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఎట్నుంచి ఎటు చూసినా హైకోర్టు విభజన అంశం కేంద్రం చేతుల్లోనే వుంది. కానీ, దానికి ముందుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి రావాలి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ ఈ భేటీకి మధ్యవర్తిత్వం వహించడమే కాదు, పెద్దన్నలా పరిస్థితిని సమీక్షించాలి. 

ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఉమ్మడి సంస్థల విభజన, దాంతోపాటుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌పై క్లారిటీ.. ఇవన్నీ ఇంకా పెండింగ్‌లో వున్నాయి గనుక, హైకోర్టు ఒక్కదాని గురించే ఎలా మాట్లాడతారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహా పలువురు టీడీపీ నేతలు ప్రశ్నించేశారు. అంటే, ఇక్కడ కాలయాపనతో సరిపెట్టడం తప్ప, హైద్రాబాద్‌ విషయంలో చంద్రబాబు సర్కార్‌ ఇంకా 'ఆశలు వదిలేసుకోలేదు' అన్న విషయం సుస్పష్టమవుతోంది కదా.

Show comments