ఇంకేం నల్లధనం..అంతా తెలుపే

బ్యాంకుల ముందు సామాన్య జనం ఐడి కార్డుల జిరాక్స్ లు, చెక్ లు, విత్ డ్రాయల్ స్లిప్ లు, పట్టుకుని, గంటల కొద్దీ నిల్చుని, వెరిఫికేషన్ చేయించుకుంటే నాలుగు వేల నుంచి పది వేలు దొరకడం గగనం అయిపోతోంది. జనం నిలువునా నీరసించిపోతున్నారు.

కానీ..బంగళూరు..కలకత్తా, గుంటూరు, హైదరాబాద్ ఇలా  ఒక్కో చోటా కొత్త రెండువేల రూపాయిల నోట్లు దొరుకుతున్నాయి. ప్రభుత్వం విధించిన కోటాలో కాదు, లక్షల్లో, కోట్లలో. 

ఏమిటిది? మోడీ ప్రభుత్వం మహాద్భుత కట్టుదిట్టంగా అమలు చేస్తున్న విధానాలు ఎలా పక్కదారి పట్టేస్తున్నాయి?ఎక్కడుంది లోపం? దొరికిన కేసులు మహా అయితే నాలుగో అయిదో? దొరకనివి ఇంకెన్నో? మరింక నల్లధనం ఎలా బయటకు వస్తుంది? నిన్నటి అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు, నేటి రెండు వేల రూపాయిల నోట్లుగా మారి మళ్లీ గోదాముల్లోకి, చీకటి కొట్లలోకి వెళ్లిపోతుంది. ఆమాత్రం ఈ మాత్రం డబ్బున్న వారు మార్చుకోవడానికే ఈ నోట్ల బహిరంగంగా పార్కుల్లోకి, బజార్లలోకి వస్తుంటే, మరి బడాబాబులు, రాజకీయ పలుకుబడి వున్నవారి సంగతేమిటి? ఏక్కడో ఏదో జరుగుతోందనేగా? 

సహకారం ఇంకెంతో?

నోట్ల రద్దు ప్రకటించి, కొత్త నోట్లు రాగానే ప్రయివేటు సహకార బ్యాంకులకు వచ్చిన నోట్లు మొత్తం పక్కదారి పట్టేసాయని వార్తలు వినవచ్చాయి. ఇది కేవలం విశాఖకో, విజయవాడకో పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా వినిపించిన సంగతి. దాంతో ఆర్బీఐ సహకార బ్యాంకులకు నోట్ల సరఫరా నిలిపివేసింది. కానీ ఈ రోజు మళ్లీ సుప్రీం కోర్టు డైరక్షన్ ఇచ్చింది.

గ్రామీణ ప్రజలు సహకార బ్యాంకులనే వాడతారని, అందువల్ల వాటికి నోట్లు ఇవ్వాలని. ఇంకేం మన బడా బాబులకు ఆనందమే. కులాల వారీగా, ప్రాంతాల వారీగా పుట్టుకువచ్చిన అనేక సహకార బ్యాంకులు వారివారి డైరక్టర్ల, మద్దుతు దార్ల సేవలో తరించేది ఖాయం. నల్లని నోట్లు తెల్లగా మారిపోవడం ఖాయం.

మూలవిరాట్ ల పని పట్టాలి..

కొత్త నోట్లు లక్షల్లో దొరికినట్లు వార్తలు వస్తున్నాయి కానీ, అవి ఏ బ్రాంచి నుంచి, ఏ బ్యాంకు నుంచి బయటకు వచ్చాయో కూడా జనాలకు తెలియ చేయాలి. ఆ బ్యాంకుల, బ్రాంచ్ ల అధికారులను బాధ్యులను చేయాలి. అప్పుడు కనీసం రేపటి నుంచి అయినా ఈ తరహా దందాలు కాస్తయినా తగ్గుముఖం పడతాయి.

లేదూ అంటే, జనం ఎండలో నిల్చున్నా వారానికి పట్టుమని పదివేలు అందుకునే పరిస్థితి వుండదు. వేల కోట్లు రాష్ట్రానికి వచ్చినా, సామాన్యుల వెతలు తీరవు. కానీ బడాబాబుల నల్లధనం మాత్రం, చకచకా తెల్లధనంగా మారిపోతుంది. ప్రజలు దేశం, త్యాగం, అంటూ ఆవేశపడి, పంటి బిగువన బాధలు భరించినదానికి ఫలితం అన్నది లేకుండా పోతుంది.

Show comments