తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నియమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ నజరానా కూడా చెల్లించారు. కానీ, ఆమె ఆ నజరానాకి సంబంధించి 'సర్వీస్ ట్యాక్స్' చెల్లించలేదు. అదిప్పుడు వివాదాస్పదమయ్యింది. సర్వీస్ ట్యాక్స్ చెల్లించనందుకుగాను సానియా మీర్జాకి సమన్లు పంపారు అధికారులు.
అసలు, ఏనాడైనా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా సానియా మీర్జా వ్యవహరించిందా.? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా ఆమె కనిపించిందా.? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా తెలంగాణలోని అధికార పక్షం సమాధానమివ్వలేదు. సానియా మీర్జా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వున్న టెన్నిస్ స్టార్. ఆ ఒక్కటే, ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అవకాశం దక్కించుకోవడానికి కారణం కాదు. అంతకు మించి, ఆమె 'మతం' ప్రాతిపదికన కూడా ఆమెకు అవకాశం కల్పించారన్న విమర్శలూ లేకపోలేదు.
ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాక కూడా, చాలా అరుదుగా మాత్రమే, ఆమె తెలంగాణ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసమో, లేదంటే మజ్లిస్ మెప్పుకోసమో సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తే, ఇప్పుడు ఆమె వివాదాల్లో చిక్కుకుపోవడం తెలంగాణలోని అధికార పార్టీకి సంకటంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించలేని పరిస్థితి టీఆర్‌ఎస్ నేతలది.